తిరుమలలో వసతి భవనం షురూ
బనశంకరి: కర్ణాటక నుంచి తిరుమల ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది తీపి కబురు. తిరుమలలో నూతనంగా నిర్మించిన ఐహోళే 132 గదుల భవనాన్ని సోమవారం ప్రారంభించినట్లు రవాణా, దేవాదాయశాఖ మంత్రి రామలింగారెడ్డి చెప్పారు. రూ.200 కోట్ల వ్యయంతో ఆధునిక వసతులతో మూడు వసతిభవనాలు, కళ్యాణ మండపం, పర్యాటక సౌధ ఆధునీకరణ చేపట్టామన్నారు. 110 ఏసీ గదులు ఉన్న బ్లాక్–2 (హంపి బ్లాక్) ను ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో గది అద్దె రూ.1350 అని తెలిపారు. 500 సీట్ల సామర్థ్యంతో శ్రీకృష్ణ ఒడెయార్ కళ్యాణ మండపం పనులు ముగింపుదశకు చేరుకున్నాయని చెప్పారు.
దర్శన్ గన్ లైసెన్సు రద్దు
దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గం రేణుకాస్వామి హత్య కేసులో రెండో నిందితునిగా ఉన్న ప్రముఖ నటుడు దర్శన్ గన్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దయింది. ఆయన వద్ద ఉన్న లైసెన్స్‌డు తుపాకులను స్వాధీనం చేసుకోవాలని బెంగళూరు ఆర్‌ఆర్ నగర పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. గన్ లైసెన్స్ రద్దు చేయవద్దని, తాను వీఐపీ కావడం వల్ల ఆత్మరక్షణకు చాలా అవసరమని దర్శన్ చేసిన వినతిని హోంశాఖ తిరస్కరించింది. దీంతో ఆర్‌ఆర్ నగర్ పోలీసులు దర్శన్ ఇంటికి వెళ్లి నోటీసు ఇచ్చి రెండు గన్‌లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
1.2 కేజీల నగలతో పరార్
బనశంకరి: ఓ వాణిజ్య సంస్థ బంగారు ఆభరణాలను కొందరు దోచుకున్నారు. హాల్‌మార్క్ సీలు వేయాలని ఇచ్చిన 1.239 కేజీల బంగారు ఆభరణాలతో పరారయ్యారు. వివరాలు.. ఈనెల 14 తేదీన సాయిగోల్డ్‌ప్యాలెస్ బసవనగుడిశాఖ సిబ్బంది ఈ నగలను తీసుకుని హాల్ మార్క్ ముద్రణ కోసం నగర్తపేటే కోనార్క్ హాల్ మార్కింగ్ సెంటర్‌లో ఇచ్చారు. 15వ తేదీ నగలను తిరిగి ఇస్తామని యజమాని భరత్ చటెడ్ చెప్పాడు. కానీ మరుసటి రోజు వెళ్లి నగలను అడిగితే.. నగలు లేవు, మా ఉద్యోగి ఎత్తుకెళ్లాడని చెప్పాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మైక్రో ఫైనాన్స్ వేధింపులు.. మహిళ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: సీఎం సిద్దరామయ్య హెచ్చరించినా మైక్రో ఫైనాన్స్ సంస్థల దురాగతాలు తగ్గడం లేదు. అప్పు కట్టాలని సిబ్బంది వేధింపులకు జనం బలవుతున్నారు. అదే రీతిలో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామనగర తాలూకా తిమ్మయ్యనదొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. యశోదమ్మ(40) 8 మైక్రో ఫైనాన్స్ కంపెనీల నుంచి రూ.5 లక్షల రుణం తీసుకుంది. అయితే గడువులోపు తీర్చలేకపోయింది. దీంతో ఆయా కంపెనీల సిబ్బంది వేధింపులు ఎక్కువయ్యాయి. దిక్కుతోచని యశోదమ్మ ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
పేదల షెడ్ల కూల్చివేత..
మునిరత్నపై కేసు
యశవంతపుర: బెంగళూరు ఆర్‌ఆర్ నగర ఎమ్మెల్యే మునిరత్నపై మరో కేసు నమోదైంది. కులదూషణ, అత్యాచారం కేసుల్లో ఆయన ఇటీవల అరెస్టయి, విడుదల కావడం తెలిసిందే. తాజాగా అనుచరులతో దినకూలీ కార్మికులపై దాడి చేయిస్తున్న ఘటనలో మునిరత్నపై, అనుచరుల మీద ఆర్‌ఎంసీ యార్డ్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలు.. పీణ్యా డిగ్రీ కాలేజీ పక్కలో షెడ్ వేసుకొని 60 కుటుంబాలు జీవిస్తున్నాయి. అందరూ దినకూలీలుగా పని చేస్తున్నారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే, అనుచరులు జేసీబీతో ఆ షెడ్లను నాశనం చేసినట్లు బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కో గుడిసెలో రూ.20 వేల నుంచి రూ.70 వేలు నగదు, 30 గ్రాముల బంగారం మట్టిపాలైందని ఫిర్యాదులో తెలిపారు. ఈ జాగాను వదిలి మీ సొంతూరు ఉత్తర కర్ణాటకకు వెళ్లిపోవాలని బెదిరించిచారని తెలిపారు. అడ్డుకున్న తమను, పిల్లలను లాగి పడేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment