కల్యాణ కర్ణాటక అభివృద్ధికి కృషి
రాయచూరురూరల్:(కలబుర్గి) కళ్యాణ కర్నాటకకు ప్రత్యేక సచివాలయం ఏర్పాటుకు సీఎంతో చర్చిస్తానని కలబుర్గి ఇంచార్జి మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. కలబుర్గిలోని సర్దార్ వల్లబాయి పటేల్ క్రీడా మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి ఈ ఏడాది రూ.5వేల కోట్లు కేటాయంచినట్లు తెలిపారు. ఆర్టికల్ 371(జె) కింద కలబురిగిలో ఉప కార్యాలయం ఏర్పాటుచేస్తామన్నారు. శాసనసభ సభ్యులు బీఅర్ పాటిల్, అల్లమ ప్రభు, తిప్పణప్ప, ఫాతిమా, జిల్లాధికారి ఫౌజియా తరనమ్ పాల్గొన్నారు.
రూ.200 కోట్లతో నగరాభివృద్ధి
రాయచూరు రూరల్: రాయచూరు నగర సమగ్రాభివృద్ధి కోసం నగర కార్పొరేషన్‌కు రూ.200 కోట్ల నిధులు కేటాయిస్తామని మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ తెలిపారు. అదివారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కళ్యాణ కర్ణాటకలో విద్య, ఉద్యోగ, అరోగ్య రంగాల్లో రిజర్వేషన్లతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాలో కంది కోనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
హుబ్లీ: ఓ వ్యక్తి మద్యానికి అలవాటు పడి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ధార్వాడా తాలూకా ఉగద గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన శేకప్ప జ్యోతిబావి(55) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. తరచూ కుటుంబ సభ్యులతో ఘర్షణ పడేవాడు. ఈక్రమంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు
ధార్వాడలోని చాణిక్య నగర్‌కు చెందిన షబ్బీర్ ఇబ్రహీంషేక్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు కేశవపుర పోలీసులు తెలిపారు. ఇతను ఈనెల 15న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని, ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
మహిళను మోసగించిన కేటుగాళ్లు
హుబ్లీ: సైబర్ కేటుగాళ్లు ఓ మహిళను మోసగించి రూ.4.08లక్షలు కొల్లగొట్టారు. నగరానికి చెందిన మహిళ ఆన్‌లైన్‌లో దుస్తులు కొనుగోలు చేసింది. కొలతలు సరిగా లేకపోవడంతో వెనక్కు ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో ప్రయత్నిస్తుండగా కేటుగాళ్లు పసిగట్టారు. ఆమెకు ఫోన్ చేసి లింక్‌ను పంపారు. దానిని క్లిక్ చేయగానే ఆమె ఖాతా నుంచి రూ. 4,08,880 నగదు గుర్తు తెలియని ఖాతాకు బదిలీ అయ్యింది. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అవినీతిపై మాట్లాడే హక్కు ఆప్ నేతలకు లేదు
హుబ్లీ: అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు ఆమ్‌ఆద్మీ నేతలకు లేదని, ఆపార్టీ సీఎం, డీసీఎం జైలుకు వెళ్లి వచ్చారని బెళగావి ఎంపీ జగదీష్‌శెట్టర్ అన్నారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీ కుటుంబం అవినీతిలో పూర్తిగా మునిగిపోయిందన్నారు. ఇప్పుడేమో క్రేజీవాల్‌కు జ్ఞానోదయమైందన్నారు. బీజేపీ అంతర్గతపోరుపై స్పందించిన ఆయన.. హైకమాండ్ అన్నింటినీ సరిచేస్తుందన్నారు. శ్రీరాములు కాంగ్రెస్ పార్టీలో చేరబోరని ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. కాంగ్రెస్ కేవలం ఆజ్యం పోస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మైక్రోఫైనాన్స్ బెడద ఎక్కువగా ఉందన్నారు. సామాన్య ప్రజలు వేధింపులకు గురవుతున్నారన్నారు. సూక్ష్మరుణ సంస్థలను కట్టడి చేసేందుకు పాతచట్టాలు సరిపోతాయన్నారు. అయితే కొత్త చట్టాలంటూ సీఎం సిద్ధరామయ్య ఉత్తుత్తి కబుర్లు చెబుతున్నారని ప్రశ్నించారు.
ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి
రాయచూరురూరల్: గ్రామాల్లోని సర్కారీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని క్రీడా మైదానంలో జరిగిన ఆందోళనలో సంఘం సంచాలకులు విద్యా పాటిల్ మాట్లాడుతూ ఉపాధ్యాయ పోస్టుల కొరతతో బోధనలో నాణ్యత కొరవడుతోందని, దీంతో విద్యార్థులకు నష్టం వాటిల్లుతోందన్నారు. నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దేవదాసి మహిళలకు సదుపాయాలు కల్పించాలని, గ్రామీణులకు రక్షిత మంచినీరు అందించాలని, రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి శరణుప్రకాష్ పాటిల్‌కు వినతిపత్రం సమర్పి ంచారు.
Comments
Please login to add a commentAdd a comment