రామాలయంలో ‘కార్తీక’ సందడి
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం కార్తీక మాసం సందడి నెలకొంది. వారాంతపు సెలవు దినాలు, కార్తీక మాసం కలిసి రావడంతో ఆలయానికి భక్తుల రాక పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను గోదావరి మాతకు సమర్పించారు. అనంతరం రామాలయంలో స్వామివారి దర్శనానికి బారులుదీరారు. క్యూలైన్ల ద్వారా అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కాగా కార్తీక మాసం కావడంతో రామాలయానికి అనుబంధంగా ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు సైతం పెద్ద ఎత్తున దర్శించుకున్నారు.
చిత్రకూట మండపంలో
సత్యనారాయణ స్వామివ్రతాలు
కార్తీక మాసం సందర్భంగా చిత్రకూట మండపంలో దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామివ్రతాలు జరిగాయి. మూలమూర్తులకు ఆదివారం పురస్కరించుకుని అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యవాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కల్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
వైభవంగా రామయ్యకు
అభిషేకం, సువర్ణ పుష్పార్చన
Comments
Please login to add a commentAdd a comment