స్వయం ఉపాధి దిశగా.. | - | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధి దిశగా..

Published Mon, Nov 11 2024 1:54 AM | Last Updated on Mon, Nov 11 2024 1:54 AM

స్వయం

స్వయం ఉపాధి దిశగా..

● రైసెట్‌ శిక్షణలో యువతులు, మహిళలు ● ఉచిత శిక్షణతో పాటు వసతి కూడా.. ● సద్వినియోగం చేసుకుంటున్న ఉమ్మడి జిల్లా యువత ● ఇప్పటివరకు 10,162 మందికి శిక్షణ

చింతకాని: ‘మారుతున్న సమాజానికి అనుగుణంగా మనమూ మారాలి.. అప్పుడే అభివృద్ధి సాధించగలుగుతాం.. కుటుంబానికి ఆసరాగా నిలబడగలం.. సమాజానికీ ఆదర్శంగా నిలుస్తాం’ అంటున్నారు గ్రామీణ ప్రాంత యువత. బ్యూటీషియన్‌, టైలరింగ్‌, మగ్గం వర్క్‌లో శిక్షణ పొందేందుకు యువతులు, మహిళలు ముందుకొస్తుండగా ఎస్‌బీఐ–ఆర్‌సెటి (గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ) వేదికగా నిలుస్తోంది. తద్వారా పలువురు శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్‌ తరాలకు బాటలు వేస్తున్నారు.

2006లో ప్రారంభం..

యువతులతో పాటు నిరుద్యోగ యువకులకు ఎస్‌బీఐ–ఆర్‌సెటి ఇస్తున్న శిక్షణ మేలైన ఫలితాలను ఇస్తోంది. ఖమ్మంలోని వరంగల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద ఉన్న తరుణి హాట్‌ ప్రాంగణంలో 22 నవంబర్‌ 2006లో స్థాపించిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌సెటి) ఇప్పటివరకు 355 శిక్షణ శిబిరాలను నిర్వహించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10,162 మందికి శిక్షణ ఇచ్చింది. వీరిలో సుమారు 8,130 మంది స్వయం ఉపాధి పొందారు. 2024–25 సంవత్సరానికి 970 మంది యువతకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 548 మందికి శిక్షణ ఇచ్చినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.

యువతకు అందిస్తున్న శిక్షణలు..

ఎస్‌బీఐ–ఆర్‌సెటి ద్వారా యువతులతో పాటు నిరుద్యోగ యువకులకు టైలరింగ్‌, బ్యూటీషియన్‌, బ్యూటీపార్లర్‌ మేనేజ్‌మెంట్‌, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌ (మగ్గం వర్క్‌), జూట్‌ ప్రొడక్ట్‌, పుట్టగొడుగుల పెంపకం, పాడి పరిశ్రమ, సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌, టూవీలర్‌ మెకానిక్‌, కంప్యూటర్‌ అకౌంటింగ్‌, సీసీ టీవీ ఇన్‌స్టాలేషన్‌, వర్మీ కంపోస్ట్‌ తయారీ, ప్లాంట్‌ నర్సరీ మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌, కారు డ్రైవింగ్‌ తదితర శిక్షణలు అందిస్తున్నారు.

శిక్షణలో సౌకర్యాలు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10వ తరగతి ఉత్తీర్ణులైన, కాని యువతను శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు గల వారై ఉండాలి. శిక్షణ పొందే వారికి సంస్థ ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నారు. శిక్షణ అనంతరం వారికి ధృవీకరణ పత్రాలను అందజేసి బ్యాంక్‌ నుంచి రుణాలు పొందేందుకు అవసరమైన సలహాలు ఇస్తారు.

ఉపాధి కల్పనే లక్ష్యం..

ఉపాధి కల్పనే లక్ష్యంగా మా సంస్థ ద్వారా యువతీ, యువకులకు శిక్షణ ఇస్తున్నాం. మా సంస్థలో అభ్యర్థుల ఇష్టం మేరకు కోర్సులు నేర్చుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల వారికి కూడా శిక్షణ ఇస్తున్నాం. ఇటువంటి శిక్షణ ప్రైవేటు సంస్థల్లో తీసుకుంటే రూ.20 నుంచి 30 వేలు అవుతాయి. వసతి, ఉచిత భోజనం అందిస్తున్నాం.

– సి.చంద్రశేఖర్‌, ఎస్‌బీఐ–ఆర్‌సెటి డైరెక్టర్‌, ఖమ్మం

నమ్మకం పెరిగింది..

ఎస్‌బీఐ–ఆర్‌సెటి వారు చింతకానిలో ఏర్పాటు చేసిన మగ్గం వర్క్‌ (వస్త్ర చిత్రకళ ఉద్యామి) శిక్షణలో చేరాను. మగ్గం వర్క్‌ నేర్చుకోవడంతో భవిష్యత్‌లో స్వయం ఉపాధి పొందుతాననే నమ్మకం పెరిగింది. భోజనం, అల్పాహారం వంటి వసతులతో ఉచితంగా శిక్షణ అందించటం బాగుంది. నేర్చుకున్న మెళుకువలను తోటి వారికి నేర్పించి ఉపాధి రంగంలో రాణించేందుకు కృషి చేస్తా.

– ఆడెపు వినిత, మగ్గం వర్క్‌,

చింతకాని

బాగా నేర్పిస్తున్నారు..

మగ్గం వర్క్‌పై తక్కువ సమయంలో సులువైన పద్ధతిలో శిక్షణ అందిస్తున్నారు. నేటి తరం యువతకు ఇలాంటి శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయి. చేతి వృత్తులకు మార్కెట్‌లో డిమాండ్‌ బాగా ఉంది. పోటీ ప్రపంచంలో స్వయం ఉపాధి ఎంతో అవసరం. ఎస్‌బీఐ–ఆర్‌సెటి ద్వారా పొందుతున్న శిక్షణతో స్వయం ఉపాధి పొందుతామనే నమ్మకం పెరుగుతుంది.

– కాలసాని పూజిత, మగ్గం వర్క్‌,

చింతకాని

ఉపాధి అవకాశం ఎక్కువ..

ప్రస్తుతం బ్యూటీషియన్‌, మగ్గం వర్క్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఎస్‌బీఐ–ఆర్‌సెటి నిర్వహిస్తున్న శిక్షణలో మహిళలు, యువతులు చాలా బాగా నేర్చుకుంటున్నారు. మా సంఘం ఆధ్వర్యంలో మండలంలో యువతులకు, మహిళలకు ఇప్పటివరకు టైలరింగ్‌, అగర్‌బత్తీలు, జూట్‌ బ్యాగుల తయారీ, మగ్గం వర్క్‌, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌ వంటి కోర్సుల్లో శిక్షణ ఇచ్చాం.

– డి.విజయలక్ష్మి, విజయభారతి మహిళా మండలి అధ్యక్షురాలు, చింతకాని

No comments yet. Be the first to comment!
Add a comment
స్వయం ఉపాధి దిశగా..1
1/5

స్వయం ఉపాధి దిశగా..

స్వయం ఉపాధి దిశగా..2
2/5

స్వయం ఉపాధి దిశగా..

స్వయం ఉపాధి దిశగా..3
3/5

స్వయం ఉపాధి దిశగా..

స్వయం ఉపాధి దిశగా..4
4/5

స్వయం ఉపాధి దిశగా..

స్వయం ఉపాధి దిశగా..5
5/5

స్వయం ఉపాధి దిశగా..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement