● ఇటీవల భేటీలో ఇరువర్గాల వాగ్వాదం ● శ్రేణులను ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురి ఆవేదన
మధిర: మధిర నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీలో మరోమారు విబేధాలు బయటపడ్డాయి. జిల్లాలో మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటించనున్న నేపధ్యాన ఖమ్మంలో మంగళవారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆధ్వర్యాన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మధిర మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొంతకాలంగా మధిరలోని పార్టీ కార్యాలయం మూతబడినా నియోజకవర్గ ఇన్‌చార్జ్ పట్టించుకోవడం లేదని తెలిపారు. కార్యకర్తలకు ఆపద వస్తే స్పందన లేక శ్రేణులు మనోధైర్యం కోల్పోతున్నారని వివరించారు. అంతేకాకుండా నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పార్టీని వీడిపోతుంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని చెప్పారు. ఇంతలోనే ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు కలగచేసుకుని పార్టీ బాగానే ఉందని చెబుతూ కార్యాలయం తీయాల్సిన బాధ్యత మండల అధ్యక్షులపైనే ఉంటుందని పేర్కొన్నారు. మధిర అంశాలు మాట్లాడుతుంటే సాంబశివరావు అడ్డుతగలడంపై శ్రీనివాసరావుకు తోడు మధిర పట్టణ అధ్యక్షుడు కనుమూరి వెంకటేశ్వరరావు, నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు, మొండితోక జయాకర్, బిక్కి కృష్ణ ప్రసాద్, అబ్బూరి రామన్ అభ్యంతరం తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక సాంబశివరావు పార్టీ అధిష్టానాన్ని బహిరంగంగా విమర్శించారని, పోలింగ్‌కు ముందు కేసీఆర్, కేటీఆర్‌ను దూషించారని గుర్తు చేయడంతో సాంబశివరావును తాతా మధు బయటకు పంపించడం వివాదం సద్దుమణిగింది.
‘స్థానిక’ ఎన్నికల వేళ వలసలు
మధిర నుంచి గెలిచిన మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి దక్కడంతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తున్నారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో బీఆర్‌ఎస్ నుంచి పలువురు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు. అయినప్పటికీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కానీ ఇతర నేతలు కానీ శ్రేణులను సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నారని పలువురు చెబుతున్నారు. మధిరకు చెందిన ఆరుగురు మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడం ఇందుకు నిదర్శనంగా వివరిస్తున్నారు. కాగా, నియోజకవర్గంలోని ఐదు మండలాలకు గాను మూడు మండలాల అధ్యక్షులు ఇన్‌చార్జ్ తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపధ్యాన ఇన్‌చార్జ్‌ను మార్చాలని వారు అంతర్గత సమావేశాల్లో నాయకుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment