శంకర్‌దాదా.. ఆర్‌ఎంపీలు !
● అత్యవసర కేసులకూ స్థాయికి మించి వైద్యం ● కమిషనరేట్ పరిధిలో 41 మందిపై కేసులు ● అధికారుల పర్యవేక్షణ కరువవడంతో యథేచ్ఛగా క్లినిక్‌ల నిర్వహణ
ఖమ్మంవైద్యవిభాగం: ఆర్‌ఎంపీలు, పీఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి. కానీ జిల్లాలోని పలువురు వచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఓపెన్ హార్ట్ సర్జరీ తప్ప మిగతా చికిత్సలన్నీ అంతా తమకు తెలుసంటూ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రమాదకర వ్యాధులు, అత్యవసర కేసులకు వైద్యం చేయడం మూలంగా చాలాసార్లు అది వికటించి బాధితులు మృతి చెందుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నాయకుల సహకారంతో మృతుల కుటుంబాలతో నయానో, భయానో ఒప్పందాలు చేసుకుని కేసుల వరకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ తరుణంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఇటీవల కొద్దికాలంగా విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు 41మంది ఆర్‌ఎంపీలు, పీఎంపీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
మెడికల్ షాపులు, ఆపై క్లినిక్‌లు
జిల్లాలో సుమారు 1,500 మంది వరకు ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ఉంటారని అంచనా. వైద్య మండలిలో రిజిస్ట్రేషన్ లేని వారెవరూ అల్లోపతి మందులు రాయకూడదని నిబంధనలు చెబుతున్నాయి. వీటిని అతిక్రమిస్తే ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5లక్షలు జరిమానా ఉంటుందని హెచ్చరించినా పలువురి తీరు మారడం లేదు. ఈనేపథ్యాన కమిషనరేట్ పరిధిలో పోలీసులు 41 మంది ఆర్‌ఎంపీలు, పీఎంపీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అర్హతకు మించి వైద్యం చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఫిర్యాదులు అందడంతో ఎన్‌ఎంసీ చట్టం 34,54 ప్రకారం ఈ కేసులు నమోదు చేశారు. చాలామంది తొలుత మెడికల్ షాపు ఏర్పాటుచేయడం.. ఆపై మూడు, నాలుగు పడకలతో ఆస్పత్రిగా మారుస్తున్నారని తెలుస్తోంది. కొందరు ఏకంగా ప్రసవాలు చేయడంతో పాటు అబార్షన్ల ద్వారా భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఆడశిశువు వద్దనుకునే వారికి సహకరిస్తూ పలువురు సొంతంగా అబార్షన్లు చేస్తుండగా మరికొందరు ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేసి కమీషన్లు దండుకుంటున్నారు. అలాగే గర్భిణులు, చిన్నపిల్లలకు చికిత్సచేయొద్దనే నిబంధనలు ఉన్నా ఎవరూ పాటించిన పాపాన పోవడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కొరవడటంతో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, కేసులు పెట్టినప్పుడు కొన్నాళ్లు జాగ్రత్త పడడం.. ఆపై యథావిధిగా కొనసాగించటం సాధారణమైపోయింది.
నిబంధనలు ఉన్నా పట్టింపేదీ?
నిబంధనల ప్రకారం ఆర్‌ఎంపీలు తమ పేరు ముందు డాక్టర్ అనే పదాన్ని వాడొద్దు. అలాగే చీటీలపై మందులు రాయడం, మందులు అమ్మడం నిషేధం. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ఆర్‌ఎంపీలే మందులు చిటీలు రాయటం, సొంత షాపుల ద్వారా మందులు అమ్మడం.. ప్రథమ చికిత్స కేంద్రం అని కాకుండా క్లినిక్‌ల పేరిట బోర్డులు ఏర్పాటుచేసి పేరు ముందు డాక్టర్ అని రాసుకోవడం పరిపాటిగా మారింది. ఎవరైనా తమను ఆశ్రయిస్తే ప్రథమ చికిత్స చేసి అత్యవసరమైతే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలే తప్ప ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేయొద్దు. కానీ చాలా ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు వీరిపై ఆధారపడుతూ బిల్లులో 30 నుండి 50 శాతం మేర కమీషన్ ఇస్తున్నారు. దీంతో వీరి ఆగడాలు మూడు పూలు, ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతున్నాయి. పోలీసు కేసులు నమోదైన నేపథ్యాన వైద్య, ఆరోగ్యశాఖాధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment