సర్వే... చకచకా
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లాలో ఊపందుకుంది. ఈనెల 8న సర్వే ప్రారంభమైంది. అయితే, తొలినాళ్లలో వివరాల సేకరణ, కోడ్ల ఆధారంగా నమోదులో ఎన్యుమరేటర్లు.. వివరాలు చెప్పేందుకు ఇళ్ల యజమానులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. కానీ ఆ పరిస్థితులన్నీ చక్కబడడంతో ఎన్యుమరేటర్లు సర్వేలో వేగం పెంచారు. జిల్లాలోని 21 మండలాలకు గాను 5,66,894 ఇళ్లలో వివరాలు సేకరించాల్సి ఉండగా, బుధవారం నాటికి 3,89,074 గృహాల్లో సర్వే పూర్తయింది. మిగిలిన ఇళ్లలోనూ గడువులోగా పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
జిల్లాలో వేగంగా ఇంటింటి కుటుంబ సర్వే
● గడువులోగా పూర్తిచేసేలా అధికారుల పర్యవేక్షణ ● తొలినాళ్లతో పోలిస్తే మెరుగైన ప్రక్రియ ● ఇప్పటి వరకు 3,89,074 ఇళ్లలో పూర్తి
ఈనెల 6 నుంచి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేలో భాగంగా ఈనెల 6 నుంచి ఇళ్లకు స్టిక్కర్లు వేయడం మొదలుపెట్టారు. తొలి రెండు రోజులు ఈ ప్రక్రియ కొనసాగగా 8వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు సర్వే ప్రారంభించారు. మొత్తం 75 ప్రశ్నలకు ఇంటి యజమానుల నుంచి సమాధానాలు రాబట్టాల్సి ఉండగా కొన్ని వివరాలు చెప్పేందుకు పలువురు నిరాకరించారు. రాజకీయ, వ్యక్తిగత ప్రశ్నలపై చాలా మంది అభ్యంతరం చెప్పారు. అయితే ఎన్యుమరేటర్లు సర్దిచెబుతుండడం, ప్రభుత్వం, ఉన్నతాధికారులు కూడా వివరాలేమీ బయటకు వెల్లడించబోమని స్పష్టత ఇవ్వడంతో యజమానులు ముందుకొస్తున్నారు.
చిన్నచిన్న సమస్యలు ఉన్నా..
జిల్లాలో సర్వే ఈనెల 8నుంచి మొదలుకాగా 3,719 మంది ఎన్యుమరేటర్లు, 314 మంది సూపర్‌వైజర్లను నియమించారు. బుధవారానికి సర్వే మొదలై 13 రోజులైంది. మొదటి రెండు, మూడు రోజులు ఎన్యుమరేటర్లు ఇబ్బందులు పడ్డారు. అయితే సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తూ వారికి సలహాలు ఇస్తుండడంతో సర్వే సజావుగా సాగుతోంది. కాగా, కొందరి ఇళ్లకు వెళ్లినప్పుడు యజమానులు లేకపోవడంతో సమస్య ఎదురవుతోంది. అసలే 75 ప్రశ్నలతో సమయం సరిపోవడం లేదని భావిస్తుండగా యజమానులు లేని ఇళ్లకు ఒకటి, రెండు సార్లు వెళ్లాల్సి ఉండడం భారమవుతోందని చెబుతున్నారు. ఇక ఇళ్లకు అంటించిన స్టిక్కర్లు ఊడిపోతున్నాయి. వీటిలో కొన్నింటిని యజమానులు అతికిస్తుండగా.. పలు ప్రాంతాల్లో ఇళ్లకు వేసిన స్టిక్కర్లు కానరావడం లేదు.
68.63 శాతం పూర్తి
జిల్లాలోని 21 మండలాల్లో 5,66,894 ఇళ్లను గుర్తించగా 4,129 ఎన్యుమరేషన్ బ్లాక్‌లుగా విభజించారు. ఇప్పటివరకు 3,89,074 ఇళ్లను ఎన్యుమరేటర్లు సందర్శించి వివరాలు నమోదు చేయడంతో బుధవారం నాటికి 68.63 శాతం పూర్తయింది. కొన్ని ప్రాంతాల్లో సర్వే మందకొడిగా సాగుతున్నా, సిబ్బంది, యజమానులకు అవగాహన పెరగడంతో ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం వేగం పుంజుకుంది. మరో 9రోజుల్లో దాదాపు 1,77,820 ఇళ్లల్లో సర్వే చేయాల్సి ఉంది. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు మధ్యాహ్నం భోజనం తర్వాత సర్వేకు వెళ్తుండగా అంగన్‌వాడీ టీచర్లు, వీఓఏలు, పంచాయతీ కార్యదర్శులు, ఆర్‌పీలు, జూనియర్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, సీఆర్‌పీలు ఇతర సిబ్బంది కూడా పాల్గొంటున్నారు.
గడువులోగా పూర్తి చేయాల్సిందే..
సమగ్ర సర్వేను ప్రభుత్వం ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని ఆదేశించింది. సర్వే ప్రారంభమై బుధవారానికి 13రోజులు పూర్తి కాగా, మరో తొమ్మిది రోజుల గడువు ఉంది. కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌తోపాటు ఇతర జిల్లాస్థాయి అధికారులు సర్వేపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన నేపఽథ్యాన మరింత వేగంగా జరిగేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిబ్బందికి సూచనలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment