శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభం
భధ్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో బుధవారం శ్రీరామ పునర్వసు దీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో పునర్వసు నక్షత్రం రోజున శ్రీరామ దీక్షలను భక్తులు స్వీకరించడం ఆనవాయితీ. శ్రీరామ మాలను స్వీకరించేందుకు తరలివచ్చిన పలువురు భక్తులు తొలుత పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించాక ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు మాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. కాగా డిసెంబర్ 17 మార్గశిర పునర్వసు రోజున ఈ దీక్షల విరమణ ఉంటుంది. ఆ రోజు గిరి ప్రదక్షిణ, పాదుకా పూజ, సాయంత్రం వెండి రథ సేవ, 18న శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కేలెండర్లు, డైరీల ఆవిష్కరణ..
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 సంవత్సర కేలెండర్లు, డైరీలను బుధవారం ఆవిష్కరించారు. అంతరాలయంలో రామయ్య పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజల అనంతరం ఈఓ ఎల్.రమాదేవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వామి వారి అవతరాలు, ప్రఽధాన ఉత్సవాలకు సంబంధించి చిత్రాలతో అందంగా తయారు చేసిన కేలెండర్లు భక్తుల కోసం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వీటితో పాటు ఈ ఏడాది డైరీలను సైతం తయారు చేయించి విక్రయశాలల్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
వైభవంగా రామయ్య నిత్యకల్యాణం..
శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా జరిగింది. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment