ఖాళీ స్థలాలు కబ్జా..!
● ఏ భూమైనా యథేచ్ఛగా ఆక్రమణలు ● అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులు మాయం ● పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం
మాయమవుతున్న బోర్డులు..
గతంలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కావడంపై స్పందించిన అప్పటి రెవెన్యూశాఖ అధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించారు. వీఆర్వోలు, వీఆర్‌ఏలు అందుబాటులో ఉండడంతో సమగ్రంగా సర్వే చేయించి ప్రభుత్వ స్థలాలుగా నిర్ధారించి బోర్డులు ఏర్పాటు చేశారు. అంతేకాక వివాదాస్పద భూములను సైతం గుర్తించి బోర్డులను పాతారు. ఇలా సుదిమళ్ల గ్రామపంచాయతీ పరిధిలో జగదాంబగుంపు గ్రామ సమీపాన, గ్రామపంచాయతీ కార్యాలయ సమీపాన, సుభాష్‌నగర్ గ్రామపంచాయతీ గురుకుల పాఠశాల సమీపాన, హెచ్‌పీ గ్యాస్ గోదాము వెనకాల, రొంపేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపాన ఇలా ఒకటేమిటి అనేక చోట్ల వేసిన బోర్డులు నేడు మాయమయ్యాయి. అంతేకాకుండా స్వయంగా ఆర్డీఓ స్థాయి ఉన్నతాధికారులు క్షేత్రపర్యటన చేసి పలు చోట్ల ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను గుర్తించి చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. కానీ కాలక్రమంలో రాజకీయ ఒత్తిళ్లు, ఉన్నతాధికారుల ఉదాసీనత, రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడం వంటి కారణాలతో పాతిన బోర్డులు కనిపించకుండాపోయాయి. బోర్డులు తొలగించిన చోట నిర్మాణాలు మళ్లీ ఊపందుకోవడంతో పాటు భూముల క్రయవిక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి.
కొరవడిన భద్రత..
మండల, పట్టణ పరిధిలో అటవీశాఖకు సంబంధించిన భూములు కూడా అన్యాక్రాంతమవుతున్నాయి. పట్టణాలు, గ్రామాలకు సమీపంలో ఖాళీగా ఉన్న అటవీభూములలో దశాబ్దాల క్రితం పేదలు ఇళ్లను నిర్మించుకున్నారు. ఆయా ఇళ్ల మధ్యలో అక్కడక్కడ నేటికీ అటవీశాఖకు సంబంధించిన ఖాళీ స్థలాలు ఉన్నాయి. అవి కూడా ఆక్రమణకు గురవుతున్నా.. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. అటవీశాఖ అధికారుల ఉదాసీనత ఫలితంగా సర్వే నంబర్ 603 పరిధిలో అటవీభూములు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవడంతోపాటు క్రయ విక్రయాలు కూడా జోరుగా జరుగుతున్నాయి.
హద్దులు తేల్చడంలో నిర్లక్ష్యం..
మండల, పట్టణ పరిధిలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సరిహద్దులు, ఎక్కడ ఎవరి భూములు, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, వాటి భౌతిక స్థితి ఎలా ఉందన్న విషయాలు దశాబ్దాలుగా ప్రశ్నార్థకంగా ఉండిపోతోంది. పట్టణ నడిబొడ్డున గోవింద్‌సెంటర్‌లో లీజు గడువు ముగియడంతో సింగరేణి సంస్థ సదరు భూమిని రెవెన్యూశాఖకు అప్పగించింది. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిలో అప్పటికే అటవీశాఖ పలు భవనాలు నిర్మించింది. రహదారి నిర్మాణంలో అటవీశాఖ భూమిని కోల్పోవడంతో రెవెన్యూశాఖ ప్రత్యామ్నాయంగా గోవింద్‌సెంటర్‌లో అప్పటికే అటవీశాఖ అధీనంలో ఉన్న 20 ఎకరాల విస్తీర్ణంలో 12 ఎకరాలను రెవెన్యూశాఖ అధికారులు అటవీశాఖకు అప్పగించారు. మిగిలిన 8 ఎకరాలను స్వాధీనం చేసుకోకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆక్రమణలను ప్రోత్సహించేలా ఉన్నాయి. ఇలాంటి భూములు పట్టణ, మండల పరిధిలో అనేకం ఉన్నా రెవెన్యూ అధికారుల వైఖరి కారణంగా ఆక్రమణదారుల పరం అవుతున్నాయి.
ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. కొంతకాలం గమనించిన కబ్జాదారులు నిర్మాణాలు చేపడుతున్నారు. వీలైతే ఇతరులకు విక్రయిస్తున్నారు కూడా. ఆ స్థలం ప్రభుత్వానిదా.. ప్రైవేట్ వ్యక్తులదా అని చూడకుండా ఆక్రమించేస్తున్నారు. ఇదంతా తెలిసినా రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
– ఇల్లెందురూరల్
ప్రైవేట్ భూములకూ కొరవడిన రక్షణ
పడావుపడి భూములు ఖాళీగా కనిపిస్తే చాలు ఆక్రమణదారులు పెట్రేగిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యాన సుదిమళ్ల గ్రామపంచాయతీ బస్టాప్ సమీపాన ఓ ముస్లింకు చెందిన భూమి కొంతకాలంగా ఖాళీగా ఉంటోంది. సదరు భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమణకు ప్రయత్నించి నిర్మాణ సామగ్రిని తరలించారని ఆరోపిస్తూ భూమి యజమానులు రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇలా వివాదాస్పందంగా ఉన్న భూములు మండలంలో కోకొల్లలు ఉండడంతో భూముల ఆక్రమణ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఆక్రమణలను ఉపేక్షించం..
ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు సేకరిస్తున్నాం. భూములు ఆక్రమించిన వారికి నోటీసులు ఇస్తాం. నిర్మాణంలో ఉన్నవాటిని నిలుపుదల చేయిస్తాం. ప్రైవేట్ భూముల ఆక్రమణలపై లిఖితపూర్వక ఫిర్యాదులందితే చర్యలు తీసుకుంటాం. – రవికుమార్, తహసీల్దార్
Comments
Please login to add a commentAdd a comment