స్పోర్ట్స్ కోటాలో గందరగోళం
గ్రామీణ క్రీడోత్సవాలు, పైకా, ఆర్‌జీకే, ఖేలో ఇండియాకు చోటు కరువు
● ఇవి స్పోర్ట్స్ కిందకు రావంటూ సర్టిఫికెట్ల తిరస్కరణ? ● ఉద్యోగాల్లో నష్టపోతున్నామని క్రీడాకారుల ఆవేదన
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రప్రభుత్వం ఉద్యోగాలు, ఉన్నత చదువుల్లో స్పోర్ట్స్ కోటా అమలు చేస్తోంది. అయితే స్పష్టమైన విధివిధానాలు లేక, అధికారులకు అవగాహన కల్పించకపోవడంతో అర్హులైన క్రీడాకారులు నష్టపోతున్నారని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా అమలు చేస్తూ సర్కారు జీఓ జారీ చేసింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులకు ఫామ్–2 కేటాయించగా, ఫామ్–3 యూనివర్సిటీ స్థాయి, ఫామ్–4 రాష్ట్ర, జాతీయస్థాయి పాఠశాలల క్రీడల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన వారే కాక పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన వారి కోసం విడుదల చేశారు. అలాగే, ఫామ్–1ను అంతర్జాతీయ స్థాయి పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన వారికి కేటాయించారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా అమలు చేసే సమయాన అధికారులు కేవలం ఫామ్–2ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని పలువురు వాపోతున్నారు.
అందరినీ ఒకే రీతిలో..
ఫాం–2 కింద అసోసియేషన్ నిర్వహించే రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు ఆడే క్రీడాకారుల సర్టిఫికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. కానీ అందరినీ ఒకే గాడిన పెట్టి సర్టిఫికెట్లను పరిశీలించి పాయింట్లు కేటాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఫాం 1, 3, 4కు సంబంధించిన సర్టిఫికెట్ల గురించి పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. కేవలం ఫాం–2నే ప్రామాణికంగా తీసుకుని స్పోర్ట్స్ కోటా ద్వారా భర్తీ చేయడం ఎంత వరకు సమంజసమని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ఫాం–2 కింద అసోసియేషన్‌కు సంబంధించిన టోర్నీల్లో ఆడిన సర్టిఫికెట్లను మాత్రమే పరిశీలించాలని నిర్ణయం తీసుకొవడం ఏమిటని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ఫాం–3కి వస్తే యూనివర్సిటీ క్రీడల్లో రాణించిన వారికే మాత్రం దీనిని పరిగణించాల్సి ఉండగా సర్టి ఫికెట్ల వెరిఫికేషన్‌లో తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఫాం–2కే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అవి పరిగణనలోకి తీసుకోకండి..
జిల్లాస్థాయిలో ఆడిన క్రీడాకారుల సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోవద్దని రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులు కోరుతున్నారు. ఫాం–2లోనే జిల్లా స్థాయి క్రీడాకారుల సర్టిఫికెట్లను పరిశీలిస్తుండడంతో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులకు ఇబ్బందులు కలుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫాం–2లో కేవలం రాష్ట్ర, జాతీయ స్థాయి సర్టిఫికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఖేలో ఇండియా టోర్నీలో పతకం సాధించినా..
భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్) ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నిర్వహించిన జాతీయస్థాయి రూరల్, పంచాయతీ యువ క్రీడా ఖేల్ అభియాన్, రాజీవ్ గాంధీ క్రీడా అభియాన్, ప్రస్తుతం ప్రవేశపెట్టి ఖేలో ఇండియా క్రీడల్లో ప్రతిభ చాటిన వారి సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోవడం లేదని క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రత్యేక ఫాంను పొందురపర్చాలని కోరుతున్నారు.
విధి విధానాలు కరువు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ కోటాను భర్తీ చేసేందుకు అయా జిల్లాల్లో కమిటీలు వేసినా కేవలం ఫాం–2ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడంలో అంతర్యమేంటనే ఆభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కమిటీల్లో ఉన్న వారికి సర్టిఫికెట్లపై అవగాహన ఉందా, లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కమిటీలు ఫాం–1, 2, 3, 4ను పరిశీలించి పాయింట్ల అధారంగా ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కమిటీల్లో స్పోర్ట్స్ అథారిటీ వారిని నియమించకుండా కేవలం వ్యాయామ ఉపాధ్యాయులనే నియమించడంతో కొంత అవరోధం ఏర్పడుతోందనే విమర్శలు వస్తున్నాయి. అసోసియేషన్, పాఠశాలల క్రీడలు, ఇతర సర్టిఫికెట్లపై సోర్ట్స్ అథారిటీ అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన ఉంటుంది. అదే వ్యాయామ ఉపాధ్యాయులకు ఏ కేటగిరీకి ఎన్ని పాయింట్లు ఇవ్వాలనే దానిపై కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందనే అభిప్రాయాలను క్రీడాకారులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జాతీయస్థాయి పోటీలకు వెళ్లిన అధికారులు సంబంధిత సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment