రాష్ట్రంలో ఏడో గ్యారంటీ అమలు ఏదీ?
● మూసీ, హైడ్రాకు మేం వ్యతిరేకం కాదు.. ● బీజేపీ బ్రహ్మరాక్షసి కావడంతోనే కాంగ్రెస్‌కు మద్దతు ● సీపీఎం జిల్లా మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
సత్తుపల్లి: సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని తీసుకొస్తానని చెప్పగా.. ఇప్పుడు గతంలో మాదిరిగానే సీపీఎం, తదితర పార్టీలు, సంఘాల నాయకుల అరెస్టులు యథాతధంగానే కొనసాగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినప్పుడు అడిగితే పోలీసులకు సమర్ధింపుగా మాట్లాడడంతో అందరూ ఒకే తాను ముక్కలుగా అర్థమైందని చెప్పారు. సీపీఎం జిల్లా 22వ మహాసభలు సత్తుపల్లిలో బుధవారం మొదలయ్యాయి. తొలుత ఎర్ర చొక్కాలు ధరించిన పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం మహాసభల్లో వీరభద్రం మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన, హైడ్రాకు తమ పార్టీ వ్యతిరేకం కాకున్నా ఆ పేరుతో పేదల ఇళ్లు కూల్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అయితే, మూసీలో డ్రగ్స్ ఫ్యాక్టరీల వ్యర్ధాలు కలవకుండా ఆపేవరకు ప్రక్షాళన సాధ్యం కాదని తెలిపారు.
కాంగ్రెస్‌పై భ్రమలు లేవు..
దేశంలో సకల సమస్యలు, కష్టాలకు చాన్నాళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీనే కారణమైనందున ఆ పార్టీపై భ్రమలేవీ లేవని వీరభద్రం తెలిపారు. బీజేపీ బ్రహ్మరాక్షసి కావడంతోనే దాన్ని అడ్డుకునేందుకే కాంగ్రెస్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో సమర్ధించామన్నారు. కాగా, ఎన్నికల ముందు రాష్ట్ర అప్పు రూ.7 లక్షల కోట్లు ఉందని తెలిసినా ఇదేసాకుగా మహిళకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇతర పథకాలేమీ అమలుచేయడం లేదని విమర్శించారు. ఇక రైతుభరోసాపై ఒక్కో మంత్రి ఒక్కోరకంగా మాట్లాడుతుండడంపై గందరగోళం నెలకొందన్నారు. ఇదేకాక గ్రూప్–1 పరీక్షలు, మూసీ, దామగుండం, హైడ్రాపై చర్చ జరగకుండా సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ తమ వ్యాఖ్యలతో జనం దృష్టిని మరల్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగా ణ తల్లిని మార్చడం, సెక్రటేరియట్‌లో విగ్రహాలు పెట్టడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇదిలాగే కొనసాగితే రేవంత్‌రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ లేకుండా ప్రజలు చేస్తారన్నారు. ఇక లగచర్లలో మూడువేల ఎకరాలను ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో లాక్కుందని వీరభద్రం తెలిపారు. ఈ భూములన్నీ రెండు పంటలు పండేవనని చెప్పారు. దీంతో తాము కమ్యూనిస్టులందరినీ కలుపుకుని ప్రభుత్వం దృృష్టికి తీసుకెళ్లడంతో నిర్ణయం మార్చుకుందని తెలిపారు. ఈసభలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, ఎం.సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శ వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు సోమయ్య, అన్నవరపు కనకయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాసరావు, విఠల్‌రావు, నాయుడు వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, రమేష్, పొన్నం వెంకటేశ్వర్లు, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment