బ్రిడ్జి కూలడంతో రాకపోకలు నిలిపివేత
చింతకాని: చింతకాని నుంచి కొణిజర్లకు వెళ్లే ప్రధాన రహదారిపై నేరడ సమీపాన ఉన్న కల్వర్టు బ్రిడ్జి శుక్రవారం కూలింది. దీంతో చింతకాని నుంచి నేరడ, కొణిజర్లకు వాహనాల రాకపోకలను నిలిచిపోయాయి. ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో కూలిందని గ్రామస్తులు తెలిపారు. ఈమేరకు బ్రిడ్జిని ఎస్సై నాగుల్‌మీరా పరిశీలించి రాకపోకలు జరగకుండా ట్రాక్టర్ ట్రక్కు అడ్డు పెట్టించారు. కాగా, అధికారులు ఇక్కడ కొత్త బ్రిడ్జిని నిర్మించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
పోలీసుల అదుపులో పేకాటరాయుళ్లు
రఘునాథపాలెం: మండలంలోని చింతగుర్తి శివారు పొలాల్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.4,200 నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.
లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు
తిరుమలాయపాలెం: మండలంలోని గోల్‌తండా గ్రామపంచాయతీ పరిధి జింకలగూడెంలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదైంది. సదరు వివాహిత పంట చేను నుంచి ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన మహ్మద్ సైదా వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వేర్వేరు గ్రామాల్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం
నేలకొండపల్లి: మండలంలోని వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు యువకులు శుక్రవారం ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. బైరవునిపల్లికి చెందిన అరవింద్ ఎలుకల మందు తాగి అస్వస్తతకు గురవడంతో నేలకొండపల్లి ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. అలాగే, నాచేపల్లికి చెందిన పి.శ్రీనివాస్ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబీకులు ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, యువకుల ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు.
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
ఖమ్మంరూరల్: మండలంలోని పోలిశెట్టిగూడెంకు చెందిన కౌలు రైతు ఉండేటి రమేష్(45) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కూలీ పనులకు వెళ్తూనే రమేష్ రెండేళ్లుగా గ్రామంలో రెండెకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన మిర్చి సాగు చేయగా పంట పెట్టుబడికి చేసిన అప్పులు పెరగడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనతో ఈనెల 26న ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగగా కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న రమేష్ శుక్రవారం మృతి చెందాడు. ఆయనకు భార్య పద్మ, ఇద్దరు పిల్లలు ఉండగా కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment