మహిళా కూలీలకు మంత్రి కుశల ప్రశ్నలు
కూసుమంచి: మండలంలోని ఎర్రగడ్డ తండాలో ఓ కార్యక్రమానికి శుక్రవారం వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్గమధ్యలో పొలంలో వరి నాట్లు వేస్తున్న మహిళా కూలీలను చూసి ఆగారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అలాగే, ఎకరంలో నాటు వేస్తే ఎంత ఇస్తారు.. ఎకరం పొలంలో నాట్లు వేయడానికి ఎంత సమయం పడుతుందని ఆరాతీశారు. అయితే, తామంతా గిరిజనులమని, ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని వారు కోరారు. దీంతో మంత్రి స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వమే గిరిజనులదని.. అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, తొలుత ఎర్రగడ్డ తండాలో కాంగ్రెస్ నాయకుడు కిశోర్‌నాయక్ వివాహ వేడుకకు హాజరైన మంత్రి వధూవరులను ఆశీర్వదించారు.
నేటి నుంచి యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలు
ఖమ్మం సహకారనగర్: నల్లగొండలో శనివారం మొదలుకానున్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ పత్రిక సంపాదకవర్గ సభ్యుడు జీ.వీ.నాగమల్లేశ్వరరావు కోరారు. ఈమేరకు ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఆయన యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర మహాసభలకు హాజరయ్యే ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించిందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు వల్లంకొండ రాంబాబు, డీ.ఎస్.నాగేశ్వరరావు, టి.శ్రీనివాసరావు, యు.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎట్టకేలకు ధాన్యం కాంటాలు
నేలకొండపల్లి: ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యంపై ‘సాక్షి’లో గురువారం ‘కొనుగోలు కేంద్రంలోనే మొలకెత్తుతున్న ధాన్యం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. నేలకొండపల్లి మండలం మంగాపు రం తండాకు చెందిన రైతు భూక్యా కిషన్‌రావు నెల రోజులుగా పడిగాపులు కాస్తున్న వైనాన్ని ఇందులో వెల్లడించగా రాజారాంపేట పీఏసీఎస్ బాధ్యులు కదిలారు. ఈమేరకు శుక్రవారం కిషన్‌రావు నాలుగెకరాల్లో సాగుచేసిన ధాన్యం కాంటా వేయించగా ఆయన ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపా రు. కాగా, ధాన్యం కాంటాలను పీఏసీఎస్ చైర్మన్ డి.బాలాజీ పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. సీఈఓ రామకోటయ్య పాల్గొన్నారు.
మూడు ఇళ్లలో చోరీ
ఖమ్మం క్రైం: ఖమ్మం శ్రీనివాసనగర్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక ముఖాలకు ముసుగులు ధరించిన గుర్తుతెలియని వ్యక్తులు మూడు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. శ్రీనివాసనగర్‌కు చెందిన భరత్‌కుమార్‌కు చెందిన ద్విచక్ర వాహనంతో పాటు మణి అనే వ్యక్తి ఇంటి తాళం పగులగొట్టి ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లారు. అలాగే, ఇంకొకరి ఇంట్లోనూ సామగ్రి చోరీ చేశారు. కాగా, బాధితుల్లోని ఒకరి ఇంటి సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, ఘటనపై బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీ టౌన్ సీఐ రమేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment