ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9–30గంటలకు హెలీకాప్టర్ ద్వారా ఆయన ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకుంటారు. కలెక్టరేట్‌లో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల విధివిధానాలపై మంత్రులు, ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు రఘునాథపాలెం మండలం మంచుకొండలో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం రాత్రి మధిరలో బస చేసి మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్ బయలుదేరతారు.
మంత్రి పొంగులేటి...
ఖమ్మం వన్‌టౌన్/కూసుమంచి: రాష్ట్ర రెవె న్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 6గంటలకు కూసుమంచి క్యాంపు కార్యాలయంలో జరిగే భోగి వేడుకల్లో పాల్గొన్నాక తహసీల్ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్, దుబ్బతండాలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభిస్తారు. ఆతర్వాత కలెక్టరేట్‌లో ప్రభుత్వ పథకాలపై జరిగే సమీక్ష, మధ్యాహ్నం రఘునాథపాలెం మండలం మంచుకొండలో ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొంటారు.
19న మాస్టర్స్
బ్యాడ్మింటన్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈనెల 19వ తేదీన ఉమ్మడి జిల్లాస్థాయి మాస్టర్స్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్(టీబీఏ) ఉపాధ్యక్షుడు, ఏఎస్పీ జి.వెంకట్రావు వెల్లడించారు. ఖమ్మంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యాన గతంలోనూ జాతీయ స్థాయి టోర్నీలను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యాన మాస్టర్స్ టోర్నీ నిర్వహన బాధ్యతలు కేటాయించినట్లు తెలి పారు. ఈ పోటీలు 35నుంచి 70 ఏళ్లు పైబడిన వారికి సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ అంశాల్లో జరుగుతాయని చెప్పారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈనెల 17వ తేదీలోగా వి.చంద్రశేఖర్(93969 72349)కు అందజేయాలని, ఇక్కడ ప్రతిభ చాటిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వి.చంద్రశేఖర్, హరీష్, జట్ల శ్రీనివాస్, కొంగర శ్రీనివాస్, డి.సత్యనారాయణ, లక్ష్మణ్ రావు, పాపారావు, కె.రమేష్, ఎం.అనిల్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
నేడు ఎత్తిపోతల
పథకానికి శంకుస్థాపన
రఘునాథపాలెం: మండలంలోని మంచుకొండ వద్ద సాగర్ కాల్వలపై ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమకుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నారు. ఈ మేరకు బందోబస్తు ఏర్పాట్లను అడిషనల్ డీసీపీ ప్రసాదరావు, ఏసీపీ రమణమూర్తి, రఘునాథపాలెం సీఐ ఉస్మాన్‌షరీఫ్ ఆదివా రం పరిశీలించారు. మరోవైపు జలవనరుల శాఖ అధికారులు సైతం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే, జలవనరులశాఖ సీఈ విద్యాసాగర్ గత నెలలో ఉద్యోగ విరమణ చేయగా ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. దీంతో శిలాఫలకంపై సీఈ పేరు ఎవరిది రాయించాలనే అంశంపై ఆదివారం రాత్రి వరకు యంత్రాంగం తర్జనభర్జన పడినా ఏ నిర్ణయం తీసుకోన్నట్లు తెలిసింది.
ప్రశాంతంగా టీసీసీ పరీక్షలు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(టీసీసీ) పరీక్షలు ఆదివారం నిర్వహించారు. ఖమ్మంలోని ఐదు కేంద్రాల్లో ఆదివారం టైలరింగ్, ఎంబ్రాయిడరీ, డ్రాయింగ్ అభ్యర్థులకు పరీక్షలు జరిగాయి. ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించగా, ప్రశాంతంగా ముగిశాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
కిన్నెరసానికి పోటెత్తిన పర్యాటకులు
● ఒకరోజు ఆదాయం రూ.50,110
పాల్వంచరూరల్ : సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఆదివారం కిన్నెరసానికి పర్యాటకులు పోటెత్తారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులో దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 764 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.27,110 ఆదాయం లభించగా, 300 మంది బోట్ షికారు చేయడంతో టూరిజం కార్పొరేషన్‌కు రూ.23,000 వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment