సాగు భూములకే ‘భరోసా’
● ఈనెల 26 నుంచి పెట్టుబడి సాయం ● ఏటా ఎకరాకు రూ.12 వేలుగా నిర్ణయం ● జిల్లాలో 7లక్షల ఎకరాలకు సాయం అందే అవకాశం
ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు తాజాగా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. వీటి ఆధారంగా జిల్లాలో 3.42లక్షల మంది రైతులకు 7లక్షల ఎకరాలకు సంబంధించి పెట్టుబడి సాయం అందే అవకాశముంది. గత ప్రభుత్వం రైతుబంధు పేరిట ప్రతీ సీజన్‌లో ఎకరాకు సీజన్‌కు రూ.5 వేల చొప్పున ఏటా రూ.10 వేలు అందించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయాన కాంగ్రెస్ పార్టీ రెండు సీజన్లకు ఏటా రూ.15వేల పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాదికి పెట్టుబడి సాయం అమలుకు సిద్ధం కాగా రూ.12వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే, అన్ని భూములకు కాకుండా సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
కొన్నాళ్లుగా కసరత్తు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల రుణమాఫీ చేయగా ఆ తర్వాత రైతుబంధు పథకాన్ని రైతుభరోసా మార్చి అమలుకు నిర్ణయించింది. ఈ అంశంపై కొన్నాళ్లుగా కసరత్తు చేస్తూ సంక్రాంతి నుంచి అమలుచేయాలని భావించింది. అయితే ఎన్ని ఎకరాలకు పథకాన్ని పరిమితం చేయాలనే తదితర అంశాలపై చర్చించి ఎట్టకేలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎలాంటి పరిమితి విధించొద్దని నిర్ణయించినప్పటికీ.. సాగు చేసినా, చేయకున్నా సాగుకు యోగ్యమైన భూమిగా గుర్తిస్తే రైతుభరోసా ద్వారా సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పథకాన్ని ఈనెల 26న గణతంత్ర దినోత్సవం నుంచి ప్రారంభించనున్నట్లు ఇటీవల కలెక్టర్లలో సమీక్షలో సీఎం వెల్లడించారు.
వ్యవసాయయోగ్యమైతే చాలు..
ధరణి(భూభారతి) పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమికే రైతు భరోసా పథకాన్ని అమలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించారు. సాగుకు అనుకూలత కలిగి, పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులకు సాయం అందించాలని నిర్ణయించారు. అలాగే, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారులనూ అర్హులుగా ప్రకటించారు. మరో పక్క బండరాళ్లతో కూడిన, వెంచర్లు చేసిన, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సేకరించిన భూములకు సాయం అందదని వెల్లడించారు. ఇక పథకం అమలు పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారానికి బాధ్యులుగా కలెక్టర్లను ప్రకటించారు.
జిల్లాకు రూ.840కోట్లు
జిల్లాలో రైతుల పట్టా భూములు సుమారు 10 లక్షల ఎకరాల మేర ఉంటాయని అంచనా. ఇందులో సాగుకు యోగ్యమైన భూమి 7లక్షల ఎకరాలు ఉంటుందని భావిస్తున్నారు. ఈ భూమిలో 5లక్షల ఎకరాల మేర సీజన్ల వారీగా పంటలు సాగు చేస్తుండగా, మరో 2లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగవుతున్నాయి. సుమారు 3.42 లక్షల మంది రైతులు ఈ భూముల్లో పంటలను సాగు చేస్తుండగా వీరికి రైతు భరోసా ద్వారా సాయం అందే అవకాశముంది. తద్వారా ఎకరాకు రెండు సీజన్లలో కలిపి రూ.12 వేల చొప్పున జిల్లాకు రూ.840 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment