కాళ్లకు కత్తులతో..
బరి గీసి...
కోడి పందేలకు అంతా సిద్ధం
● తెలంగాణ–ఏపీ సరిహద్దుల్లో బిర్రులు రెడీ ● రూ.లక్షల్లో జూదానికి సై అంటున్న పందెం రాయుళ్లు ● కుక్కుట శాస్త్రమే ప్రామాణికంగా పలువురి పోటాపోటీ
మామిడితోట చుట్టూ ఫెన్సింగ్‌తో సిద్ధమైన బిర్రులు
సత్తుపల్లి: సంక్రాంతి పండుగతో పాటే కోడి పందేలూ వచ్చేస్తాయి. ఆనవాయితీ పేరుతో రూ.లక్షల్లో పందేలు, అంతకంటే పెద్దమొత్తంలో పేకాటకు తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పందెం బిర్రులు సిద్ధమయ్యాయి. పూర్వకాలంలోనూ కోడి పందేలు జరిగేవని చెబుతారు. ఈనేపథ్యాన భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడురోజులు పందేలకు అడ్డూఅదుపు ఉండదు. ఏపీలోని ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాలకు సరిహద్దుగా ఉండడంతో ఇక్కడ నుంచి వేలాదిగా పందేలకు వెళ్తారు. కొందరు ఆసక్తితో చూడడానికి.. మరికొందరు జూదంలో పాల్గొడానికి వెళ్తుంటారు. జనవరి వచ్చిందంటే ఈ ప్రాంతాల్లో ఏ నలుగురు కలిసినా పందేలు ఎక్కడ జరుగుతున్నాయి, బిర్రులు ఎక్కడ ఉన్నాయి.. ఎవరు నిర్వహిస్తున్నారనే చర్చ సాధారణంగా మారుతోంది.
ఆంధ్రా సరిహద్దుల్లో..
ఆంధ్రా సరిహద్దు మామిడి తోటల్లో ఇప్పటికే పందెం బిర్రులు సిద్ధమయ్యాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పలువురు కూడా మామిడి, ఆయిల్‌పామ్ తోటలను లీజ్‌కు తీసుకుని బిర్రులు ఏర్పాటుచేసిన ట్లు సమాచారం. ఆంధ్రాప్రాంతంలో సంప్రదాయం పేరిట పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవనే భావనతో అటు నిర్వాహకులు, ఇటు పందెంరాయుళ్లు ఏపీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
రూ.కోట్లల్లో పేకాట జూదం
కోడి పందేల మాటున రూ.కోట్లల్లో పేకాట జూదం నడుస్తుంది. కోడి పందాలు ఒక ఎత్తయితే.. రాత్రీపగలు తేడా లేకుండా జనరేటర్లు అమర్చి మరీ లోనా–బయట(పేకాట) నిర్వహిస్తుండడంతో నిమి షాల్లో రూ.లక్షల నగదు చేతులు మారి పలువురు రోడ్డున పడిన సందర్భాలు ఉన్నాయి. దీనికి తోడు గుండు పట్టాలతో జూదం నిర్వహిస్తారు. ఈ పది రోజులు ఆంధ్రా సరిహద్దుల్లో జోరుగా పేకాట నడవనుండగా అప్పుడప్పుడు ఘర్షణలు కూడా చోటు చేసుకుంటాయి.
కోడికూత వినిపించిందంటే..
పుంజు పట్టుకొని తిరిగేవాళ్లు.. కేవలం గంటల వ్యవధిలోనే పందెంరాయుళ్లను ఒక చోటకు చేర్చ డం.. పందెం వేయడం.. మళ్లీ స్థలం మార్చడం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే, సంక్రాంతి మూడు రోజులు మాత్రం నిర్ణీత ప్రాంతంలోనే భారీస్థాయిలో పందేలు జరుగుతుంటాయి. ఏపీ మాదిరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పందేలు కాస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పాత కేసుల్లో ఉన్న వారిని బైండోవర్ చేసి హెచ్చరిస్తున్నారు.
పందెం కోళ్లలో రకాలు..
పందెం కోళ్లను ఏడాదంతా ఇష్టంతో పాటు కష్టపడి పెంచుతారు. పౌష్టిక ఆహారం అందిస్తూ ఈత కొట్టించి సిద్ధం చేస్తారు. ఒక్కో కోడి పుంజు ధర రూ.10వేల నుంచి రూ.2లక్షల వరకు కూడా పలుకుతుంది. కాకి, నెమలి, డేగ, సేతువు, పర్ల, పింగళి, పచ్చకాకి, ఎర్రబోర, మైల, కొక్కిరాయి, పండు డేగ, ఎర్రకెక్కిర, అబ్రాస్, నల్లనవల, నల్లమచ్చల సేతువు ఇలా 50 రకాల వరకు ఉండగా.. ప్రాంతాల ఆధారంగా పేర్లు మారుతుంటాయి.
కుక్కుట శాస్త్రమే ఆధారం!
కోడిపందెం రాయుళ్లు కుక్కుట శాస్త్రం ఆధారంగా ముందుకు సాగుతుంటారు. ఏ సమయాన ఏ నక్షత్రంలో, ఏ రంగు పుంజు పొడుస్తుంది.. యజమాని పేరులోని మొదటి అక్షరాన్ని అనుసరించి ఏ పుంజుపై పందెం కాస్తే మంచిదో చూసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక కోడి పందేలు జరిగే ప్రదేశం, కోళ్ల యజమానులు కూర్చునే ప్రదేశం, పందెం జరిగే రోజు నక్షత్రం వంటివి కూడా పోటీలో పరిగణనలోకి తీసుకుంటారంటే ఆశ్చర్యం కలగకమానదు. బిర్రు ఏ దిశగా ఉంది, యాజమాని తన కోడి పుంజును ఏ దిక్కు నుంచి తీసుకెళ్తారనే అంశంపై జయపజయాలు ఆధారపడి ఉంటాయని నమ్ముతారు. ఇక బరిలోకి దింపే వరకు పందెం కోడిని బయటకు చూపించడానికి కూడా ఇష్టపడరు. అలాగే, పందెం బిర్రుల వద్ద పుంజుల కాళ్లకు కత్తుల కట్టే వారిని ప్రత్యేకంగా నియమించుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment