భూవివాదాల పరిష్కారానికి కృషి
● రెవెన్యూ, అటవీభూముల సరిహద్దుల నిర్ధారణకు చర్యలు ● తొలి దశలో నియోజకవర్గానికి ఒక గ్రామంపై దృష్టి ● అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మంవన్‌టౌన్: రెవెన్యూ, అటవీ శాఖల నడుమ భూవివాదాల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా రెవెన్యూ, అటవీ భూముల్లో సమస్యల పరిష్కారం, రెవెన్యూ, ప్రైవేట్ వ్యక్తుల మధ్య భూవివాదాలపై సమీక్షించారు. అసైన్డ్ పట్టాలతో గత 40ఏళ్లుగా సాగు చేస్తున్న రైతులకు ఇబ్బంది లేకుండా రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని సూచించారు. భూముల సర్వే కోసం ఆధునాతన సామగ్రిని సమకూరుస్తామని చెప్పారు. తొలుత ప్రతీ నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు. జిల్లాలోని 15సర్వే నంబర్లకు సంబంధించి 1,500ఎకరాల్లో రెవెన్యూ, అటవీ సరిహద్దు సమస్య ఉన్నందున పరిష్కరించాలని సూచించారు. కాగా, జిల్లాలో మైనింగ్ క్వారీల కోసం కేటాయించిన భూములు, వస్తున్న ఆదాయంపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కొన్నిచోట్ల అనుమతికి మించి భూముల్లో మైనింగ్ చేస్తుండగా, ఇంకొన్ని చోట్ల గడువు ముగిసినా తవ్వకాలు చేపడుతున్నట్లు సమాచారం ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇక నూతన రెవెన్యూ చట్టానికి సంబంధించి నిబంధనల రూపకల్పనకు అధికారులు సలహాలు ఇవ్వాలని మంత్రి తెలిపారు.
భూసేకరణ త్వరగా పూర్తిచేయండి
మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ మున్నేరు తీరం వెంట రూ.690కోట్లతో 17కి.మీ. మేర ఆర్‌సీసీ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఖమ్మం రూరల్ మండలం వైపు 5.1 కి.మీ.లు, అర్బన్ మండలం మండలం వైపు 1.7 కి.మీ. ప్రభుత్వ భూమి ఉన్నందున పనులు చేపట్టాలని చెప్పారు. మిగతా భూసేకరణ పురోగతిపై ఎప్పటికప్పుడు వివరాలు అందించాలని, ప్రైవేట్ భూముల యజమానులతో చర్చించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో జూలై 15 నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు. ఈసమావేశాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, డీఎఫ్‌ఓ సిద్దార్ధ్ విక్రమ్‌సింగ్, ఆర్డీఓలు నర్సింహారావు, రాజేందర్, పాలేరు ప్రత్యేకాధికారి రమేష్, ఇరిగేషన్ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, ఖమ్మం అర్బన్, రూరల్ తహసీల్దార్లు రవికుమార్, రాంప్రసాద్, ఇరిగేషన్ ఈఈ అనన్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment