చలి తగ్గాక రగ్గులు ఇస్తారా..?
● అధికారులపై అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆగ్రహం ● మొగడ్‌దగడ్ బాలుర ఆశ్రమ పాఠశాల తనిఖీ
కౌటాల(సిర్పూర్): ‘చలి తగ్గాక విద్యార్థులు రగ్గులు పంపిణీ చేస్తారా.. చలికాలంలో కాకుండా ఎప్పుడు స్వెటర్లు ఇస్తారు..’ అంటూ అధికారులపై అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌటాల మండలం మొగడ్‌దగడ్‌లోని బాలుర ఆశ్రమ పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 30 మంది విద్యార్థులు గైర్హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజుల తరబడి పాఠశాలకు రాని వారి వివరాలను రెండు రోజుల్లో తనకు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం కూరగాయలు, పప్పులు, గుడ్లు పరిశీలించారు. పప్పు కూర పలుచగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. సమీపంలోని మురుగు కాలువలో నీరు నిలిచి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెగ్యులర్ కుక్‌ను నియమించాలని ఆదేశించారు. వాటర్ హీటర్ మరమ్మతు చేసి వేడినీటిని అందించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రెండు, మూడు రోజుల్లో యూనిఫాం, త్వరలోనే స్వెటర్లు, రగ్గులు పంపిణీ చేయాలని ఆదేశించారు.
వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
డిసెంబర్ 1 వరకు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. కౌటాల ఎంపీడీవో కార్యాలయంలో సర్వే వివరాల ఆన్‌లైన్ నమోదును పరిశీలించారు. అలాగే స్థానిక పీహెచ్‌సీ, సాండ్‌గాంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో కోట ప్రసాద్, ఎంపీవో మహేందర్‌రెడ్డి, ఏపీవో పూర్ణిమ, ఏపీఎం ముక్తేశ్వర్, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ, సిబ్బంది ఉన్నారు.
రైతుల కోసమే కొనుగోలు కేంద్రాలు
చింతలమానెపల్లి(సిర్పూర్): రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని రవీంద్రనగర్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. సన్నరకం వడ్లకు ప్రభుత్వం మద్దతు ధరతోపాటు బోనస్ చెల్లిస్తునందున రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఈవోలు రైతులకు అవసరమైన వివరాలు అందించాలన్నారు. ఎంపీడీవో ప్రసాద్, రైతులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment