వరికోతకు హార్వెస్టర్ల కొరత
రెబ్బెన మండలం నంబాలకు చెందిన ఆకుల లచన్నగౌడ్ తనకున్న మూడెకరాలతో పాటు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేశారు. సాగునీటి వసతి ఉండటంతో పంట ఆశాజనకంగా ఉంది. 25 రోజుల క్రితమే పంట కోతకు రాగా అప్పటి నుంచి హార్వెస్టర్ యంత్రాల కోసం ఎదురుచూస్తున్నాడు. జిల్లాలో యంత్రాల కొరత కారణంగా పంట కోయలేదు. కోత ఆలస్యం కావడంతో వరి నేలవాలి ధాన్యం రాలుతోంది. ఎట్టకేలకు కరీంనగర్ జిల్లాకు నుంచి హార్వెస్టర్ తెప్పించి వరి కోయించాడు. ఇలా జిల్లాలో వరిసాగు చేసిన రైతులు కోతల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రెబ్బెన(ఆసిఫాబాద్): జిల్లాలో యంత్రాల కొరత రైతుల పాలిట శాపంగా మారుతోంది. జిల్లాలో సాగవుతున్న విస్తీర్ణానికి సరిపడా వరికోత యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సాగు సమయంలో కష్టం కంటే పండిన పంటను నూర్పిడి చేసేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. వానాకాలం, యాసంగి రెండు సీజన్లలోనూ అందుబాటులో హార్వెస్టర్లు లేకపోవడంతో పక్క జిల్లాల నుంచి తెప్పిస్తున్నారు. అయినా సకాలంలో యంత్రాలు దొరకపోవడంతో పంట దెబ్బతిని నష్టంపోతున్నారు.
ఒకేసారి మొదలైన కోతలు
జిల్లాలో 55 వేల ఎకరాల వరకు వరి సాగు ఉండగా, గతానికి భిన్నంగా ఈసారి జిల్లా అంతటా కోతలు ఒకేసారి ప్రారంభమయ్యాయి. దీంతో హార్వెస్టర్ యంత్రాల కొరత ఏర్పడింది. సాధారణంగా దహెగాం, కౌటాల, బెజ్జూర్, పెంచికల్‌పే ట్, కాగజ్‌నగర్ ప్రాంతాల వైపు వరికోతలు కాస్త ముందుగా ప్రారంభమవుతాయి. హార్వెస్టర్లు ముందుగా అటువైపు కోతలు పూర్తిచేసుకుని ఆ తర్వాత రెబ్బెన, ఆసిఫాబాద్, తిర్యాణి మండలా లకు చేరుకుంటాయి. గతానికి భిన్నంగా జిల్లా అంతటా ఒకేసారి వరికోతలు మొదలయ్యాయి. వరికోతలు ప్రారంభమై దాదాపు 25 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కనీసం 30 శాతం కూడా పూర్తి కాలేదు. కోతలు ఆలస్యమవుతుండటంతో భూముల్లో తడి ఆరిపోయి వరి నేలకొరుగుతుంది. ధాన్యం నేలరాలి దిగుబడి తగ్గుతోంది. చేతి కందే పంట నేలపాలు అవుతుండటంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
రైతులపై అదనపు భారం
గతంలో వరికోతలను కూలీలతో చేపట్టేవారు. కూలీలు కోసిన తర్వాత ట్రాక్టర్లతో నూర్పిడి చేపట్టేవారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న కూలీ ల కొరతతో రైతులు వరికోత యంత్రాలపై దృష్టి సారించారు. సమయం, డబ్బు ఆదా అవుతుండటంతో ఎక్కువ మంది యంత్రాల సాయంతోనే కోతలు చేపడుతున్నారు. గతేడాది టూ వీల్ హా ర్వెస్టర్‌కు గంటకు రూ.2వేల వరకు కిరాయి తీసుకోగా, ఫోర్‌వీల్ హార్వెస్టర్‌కు గంటకు రూ.2,800, ట్రాక్ హార్వెస్టర్‌కు రూ.3వేల వరకు తీసుకున్నా రు. ఈసారి మాత్రం టూ వీల్ హార్వెస్టర్‌కు రూ. 2,200 నుంచి రూ.2,300 వరకు వసూలు చేస్తుండగా, ఫోర్‌వీల్ యంత్రానికి రూ.3వేలు, ట్రాక్ హార్వెస్టర్‌కు రూ.3,500 వరకు వసూలు చేస్తున్నా రు. అత్యవసరమైన సమయంలో అధిక కిరాయి చెల్లించేందుకు వెనుకాడటం లేదు. దీంతో అన్నదాతలపై అదనపు భారం పడుతోంది.
పక్క జిల్లాల యంత్రాలపై ఆధారపడుతున్న జిల్లా రైతులు
సబ్సిడీ పరికరాలు రాక ఇబ్బందులు
పక్క జిల్లాల నుంచి రావాల్సిందే..
జిల్లాలో ఏటా వరికోతలు చేపట్టేందుకు పక్క జిల్లాల హార్వెస్టర్లపై ఆధారపడాల్సి వస్తోంది. వరి సాగు అధికంగా ఉండే మండలాల్లోనూ కనీసం ఐదు హార్వెస్టర్లు కూడా అందుబాటులో లేవు. కరీంనగర్ జిల్లా నుంచి పదుల సంఖ్యలో వరికోత యంత్రాలను తెప్పిస్తున్నారు. ఈసారి పక్క జిల్లాలో వరికోతలు పూర్తి కాకపోవడంతో అక్కడి యంత్రాలను జిల్లాకు పంపించేందుకు యజమానులు ఆసక్తి చూపడం లేదు. ఇది జిల్లాలో వరికోతలపై ప్రభావం చూపుతోంది. మరో పది రోజులు గడిస్తే తప్పా పక్క జిల్లాల నుంచి హార్వెస్టర్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఒక్కో హార్వెస్టర్ ఖరీదు రూ.లక్షల్లో ఉండటంతో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న జిల్లా రైతులు వాటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం లేదు. గతంలో ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు, యంత్రాలను అందించేది. 2018 నుంచి ప్రభుత్వం సబ్సిడీ యంత్రాల పంపిణీని పూర్తిగా నిలిపివేసింది.
Comments
Please login to add a commentAdd a comment