ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: జిల్లాలో ప్రజారోగ్యంపై వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా వైద్యాధికారి సీతారాంతో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, మెడికల్ సూపర్‌వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. తమ పరిధిలో ని గర్భిణుల వివరాలు నమోదు చేసి సమయానుసారంగా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రక్తహీనతతో బాధపడే గర్భిణులు, బాలింతలకు సకాలంలో వైద్యం, పోషకాహారం అందించాలన్నారు. వైద్యసిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి క్షయ, కుష్టు, మలేరియా, పైలేరియా వ్యాధులు నివారించాలని సూచించారు. ఇమ్యునైజేషన్ ప్రక్రియ నిరంతరంగా కొనసాగించాలన్నారు. ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా ఆరోగ్య, ఆశ కార్యకర్తలు అవగాహన కల్పించాలని సూచించారు. పీఎం జన్‌మన్ పథకం కింద పీవీటీజీ గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలందించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పీహెచ్‌సీల వారీగా వైద్యసిబ్బంది సమావేశం ఏర్పాటు చేసుకుని సమీక్షలు నిర్వహించుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో గురువారం మధ్యాహ్నం భోజనం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వంట నిర్వాహకులు మెనూ పాటించాలన్నారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజనం ధరలు పెంచిందని, నాణ్యమైన సామగ్రితోనే వంట చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment