ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధికి పాటుపడతా..
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ పనులకు నిధులు ఇవ్వాలి
అభివృద్ధి విషయంలో వివక్ష తగదు
ఆసిఫాబాద్: ‘ప్రజల ఆశీస్సులతో రెండోసారి ఎమ్మెల్యేగా అవకాశం లభించింది. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టినప్పటికీ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నన్ను ఆశీర్వదించారు. ప్రజాబలంతో ఎమ్మెల్యేగా విజయం సాధించా..’ అని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ఏడాది పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’కిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. అలాగే తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులు కూడా పూర్తిచేసేందుకు తమవంతు శ్రమిస్తానని అన్నారు. వివరాలు ఆమె మాటల్లోనే..
సమస్యలపై నిత్య పోరాటం
ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ఉంటా. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానంగా విద్య, వైద్యం మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఇందుకు నా వంతు కృషి చేస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధిపై దృష్టి సారిస్తా. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పోరాడి కుమురంభీం పేరిట కొత్త జిల్లా సాధించుకున్నాం. పాలనను ప్రజలకు చేరువ చేశాం.
బీఆర్‌ఎస్ పాలనలో ఆసిఫాబాద్ అసెంబ్లీ పరిధిలోని పల్లెలు ఎంతో అభివృద్ధి చెందాయి. జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం వైద్య కళాశాల, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది. రోగులకు అవసరమైన మందులు పూర్తిస్థాయిలో లేవు. కేవలం ప్రభుత్వ ఆస్పత్రి రెఫరల్ కేంద్రంగా మారింది. ఖాళీలు భర్తీ చేసి వైద్య సేవలు మెరుగుపర్చాలి.
అభివృద్ధిలో వివక్ష
గతంలో మన ఊరు– మన బడి పథకం పేరుతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పేరుగా మార్చింది. గతంలో చేసిన పనులకే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను విజయం సాధించా. అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి వివక్ష తగదు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. బీఆర్‌ఎస్, విపక్ష ఎమ్మెల్యేలకు ఒక్కరూపాయి నిధులు ఇవ్వడం లేదు. పోలీసులను గుప్పిట్లో ఉంచుకొని ప్రతిపక్షాలను ప్రభుత్వం అణగదొక్కాలని చూస్తోంది. ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతా. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టాలి.
పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి
అన్ని రంగాల్లో వెనుకబడిన జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి. అప్పుడే గిరిజన, గిరిజనేతర యువతకు ఉపాధి లభిస్తుంది. గతంలో వాంకిడి మండలం బెండార శివారులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం 1000 ఎకరాల స్థలం గుర్తించాం. పరిశ్రమల స్థాపనపై పాలక వర్గం దృష్టి సారించడం లేదు. పరిశ్రమలు ప్రోత్సహిస్తూ యువతకు ఉపాధి చూపాలి. బీఆర్‌ఎస్ హయాంలో జిల్లా కేంద్రంలో డైట్ కళాశాల మంజూరు చేసినప్పటికీ రెండేళ్లుగా ప్రారంభించడం లేదు. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంతో విఫలమైంది.
నిలిచిన రహదారుల నిర్మాణం
నియోజకవర్గానికి సరిపడా నిధులు ఇవ్వడం లేదు. తమ ప్రభుత్వ హయాంలోనే రహదారుల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేశాం. తిర్యాణి మండలం గుండాల, మంగీ వంతెన నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఆసిఫాబాద్ మండలం అప్పపల్లి వంతెన నిర్మాణానికి రూ.1.80 కోట్లు మంజూరయ్యాయి. ఉమ్మడి జిల్లా మంత్రి సీతక్క సైతం ఆ గ్రామాన్ని సందర్శించినప్పటికీ పనులు ముందుకు సాగడం లేదు. గుండి వంతెనను కూడా మంత్రి పలుమార్లు పరిశీలించినా పనులు ముందుకు సాగడం లేదు. బ్రిడ్జి ఎత్తు, వెడల్పు పెంచా ల్సిన అవసరం ఉంది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సోషల్ వెల్ఫేర్ ఇంటిగ్రేటెడ్ వసతి గృహాలు మంజూరు చేసింది. కానీ గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లాకు మంజూరు చేయలేదు. అధికార పార్టీ ఉన్నచోట అన్ని జిల్లాలకు అభివృద్ధిలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ వివక్ష చూపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ఉన్నచోట ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. నాలుగేళ్ల తర్వాత రాష్ట్రంలో బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంది. ప్రజలు మా వైపే ఉన్నారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో సైతం సత్తా చాటుతాం.
Comments
Please login to add a commentAdd a comment