స్కూల్లో విచారణ చేస్తున్న ఐసీడీఎస్ సీడీపీవో సముద్రవేణి
చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదుతో విచారణ చేసిన ఐసీడీఎస్ అధికారి
పెడన: పట్టణంలోని ఓ ప్రీస్కూల్లో నాలుగేళ్ల బాలుడిని చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఆదివారం ఫిర్యాదు అందింది. ఈ మేరకు స్పందించిన ఐసీడీఎస్ బంటుమిల్లి ప్రాజెక్ట్ సీడీపీవో వి.సముద్రవేణి సోమవారం పెడనలో విచారణ నిర్వహించారు. బాధ్యులపై చర్యలకు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు సిఫార్సు చేస్తామని తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ సందర్భంగా సముద్రవేణి మాట్లాడుతూ అగ్రిల్యాబ్ ఏఈవో సుజన చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారని తెలిపారు. సుజనకు ఇద్దరు కవల పిల్లలున్నారని, వారిద్దరికీ నాలుగేళ్ల వయస్సు ఉందన్నారు. పిల్లల సంరక్షణకు వెటర్నరీ ఆసుపత్రికి సమీపంలోని కిడ్స్ వరల్డ్ ప్రీస్కూల్లో చేర్పించారన్నారు. ఉదయం అక్కడ విడిచివెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకెళ్లారని చెప్పారు. ఈ క్రమంలో గత శనివారం పెద్ద కుమారుడు రేవాన్స్ శరీరంపై గాయాలు ఉన్నట్లు సుజన గుర్తించిందని పేర్కొన్నారు. వెంటనే ప్రీస్కూల్ నిర్వాహకురాలైన సాయిసింధూశ్రీని ప్రశ్నించారని తెలిపారు. అయితే స్కూల్లో పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారని, ఆ క్రమంలో కర్రతో కొట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారని ఫిర్యాదులో తెలిపారన్నారు. రేవాన్ష్‌ను అదేరోజు స్థానికంగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించిన తల్లిదండ్రులు ఆదివారం చైల్డ్ హెల్ప్‌ను సంప్రదించారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణకు వచ్చినట్లు సీడీపీవో తెలిపారు. బాలుడి తల్లిదండ్రులను, ప్రీస్కూల్ నిర్వాహకుల్ని పిలిచి ప్రశ్నించామన్నారు. బాలుడి వంటిపై గాయాలను సీడీపీవోకు తల్లిదండ్రులు చూపించారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కానివ్వబోమని నిర్వాహకురాలు సీడీపీవోకు వివరణ ఇచ్చారు. ఫ్రీస్కూల్ నిర్వహణకు తప్పనిసరిగా తమ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని, కానీ అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. మచిలీపట్నం ప్రాజెక్ట్ డైరెక్టరు వారికి నివేదికను అందజేస్తామని సీడీపీవో తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment