షూటింగ్ బాల్‌లో విద్యార్థినికి బంగారు పతకం
పెనమలూరు: షూటింగ్ బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఇంటర్ విద్యార్థిని అనురాధరెడ్డి బంగారు పతకం సాధించింది. ఇటీవల నేపాల్‌లో జరిగిన రెండవ ఏషియన్ షూటింగ్ బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో అనురాధరెడ్డి భారత జట్టు నుంచి ఆడి సత్తా చాటారు. ఈ సందర్భంగా గురువారం శ్రీచైతన్య కాలేజీ సరస్వతీ సౌధంలో జరిగిన కార్యక్రమంలో అను రాధరెడ్డిని కాలేజీ ఏజీఎం మురళీకృష్ణ, డీన్‌లు కె.శ్రీనివాసరావు, హరిబాబు, ఏవో శ్రీకాంత్, అధ్యాపకులు అభినందించారు.
ఎలక్ట్రీషియన్, ఏసీ, సోలార్ టెక్నీషియన్ ఉచిత కోర్సులు
ఉంగుటూరు: ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో అబ్దుల్ కలాం నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఎలక్ట్రీషియన్, ఏసీ టెక్నీషియన్, సోలార్ టెక్నీషియన్ ఉచిత కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, ఐటీఐ చదివి 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన వారు శిక్షణ పొందడానికి అర్హులని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలం మూడు నెలలు ఉంటుందని, సర్టిఫికెట్‌తో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని వివరించారు. ఈ నెల12వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని ఆసక్తి గలవారు 96664 22627, 94927 87399, 83090 31720 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2.28 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వరస్వామివార్లకు భక్తులు హుండీల ద్వారా రూ.2.28 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను మహా మండపం ఆరో అంతస్తులో గురువారం లెక్కించారు. అమ్మవారి ఆలయం, మల్లేశ్వర స్వామి ఆలయం, ఉపాలయాల్లోని హుండీల్లో ఆదాయాన్ని లెక్కించగా రూ. 2,28,81,128 లభించింది. 328 గ్రాముల బంగారం, 3.480 కిలోల వెండి లభ్యమైనట్లు ఈవో రామచంద్ర మోహన్ పేర్కొన్నారు. యూఎస్‌ఏకి చెందిన 158 డాలర్లు, యుఏఈకి చెందిన 130 దిర్హమ్స్, కెనడాకు చెందిన 115 డాలర్లు, సింగపూర్‌కు చెందిన 55 డాలర్లు, ఇంగ్లండ్‌కు చెందిన 65 డాలర్లు, ఒమన్‌కు చెందిన 2 వేల బైసాలు, కువైట్‌కు చెందిన 30 దినార్లు లభించాయి. ఆన్‌లైన్ ద్వారా రూ. 78,333 విరాళాలు దేవస్థానానికి అందాయని పేర్కొన్నారు. కానుకల లెక్కింపును డీఈవో రత్నరాజు, ఏఈవోలు, సూపరిండెంటెంట్లు, ఆలయ అధికారులు, సిబ్బంది, సిబ్బంది పాల్గొన్నారు.
15న విజయవాడలో మ్యూజికల్ నైట్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసీమియా బాధితుల సహాయార్థం ఈ నెల 15న మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంఽధీ మున్సిపల్ స్టేడియంలో ఈవెంట్‌ను మ్యూజికల్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గురువారం నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో భువనేశ్వరి మాట్లాడుతూ సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తోందన్నారు. టికెట్లపై వచ్చే ప్రతి రూపాయి తలసీమియా బాధితులకు అందిస్తామన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ తలసీమియా బాధితుల కోసం అని చెప్పగానే వెంటనే కార్యక్రమానికి వస్తానని చెప్పానన్నారు. సమావేశంలో ఎన్టీఆర్ ట్రస్టు సీఈఓ రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment