ఆయుర్వేద విద్యపై నిర్లక్ష్యం
● డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల విద్యార్థులకు వసతులు కరవు ● బోధనా సిబ్బంది కొరత ● తరగతి గదులు చాలని వైనం ● రాష్ట్రంలో ఏకై క ఆయుర్వేద కళాశాల ఇది
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆయుర్వేద విద్యపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల రాష్ట్రంలోని ఏకై క ఆయుర్వేద కాలేజీ. దీన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వసతులు కరవయ్యాయి. కళాశాలలో వైద్య విద్యార్థులు కూర్చునేందుకు అవసరమైన బెంచీలు చాలక అవస్థలు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. మరోవైపు పురాతన భవనం కావడంతో శ్లాబులు పెచ్చులూడుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. వారికి కావాల్సిన వసతుల విషయంలో ఎన్నిసార్లు ఆయుష్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలు గడిచినా ఇప్పటి వరకూ రూపాయి కూడా నిధులు విదల్చలేదని, ఇలా అయితే ఎలాగని పలువురు బోధనా వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిస్థాయిలో నియమించాలి
డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో బీఏఎంఎస్ సీట్లు 75(రాష్ట్ర కోటా 60, ెకేంద్ర కోటా 15) ఉన్నాయి. వీటితో పాటు మరో 23 పోస్టు గ్రాడ్యుయేషన్ సీట్లు ఉన్నాయి. యూజీ, పీజీ విద్యార్థులకు అవసరమైన బోధనా సిబ్బంది అందుబాటులో లేరు. గత ఏడాది అడ్మిషన్ల కోసం జిల్లాల్లోని డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న 15 మందిని ఆయుర్వేద కళాశాలలో డిప్యూటేషన్‌పై నియమించారు. వారిలో నిబంధనల ప్రకారం 8 మందికే అర్హత ఉండగా, మిగిలిన ఏడుగురికి ఎన్‌సీఐఎం నిబంధనల మేరకు ఎలిజిబులిటీ లేదని తేల్చారు. బోధనా సిబ్బందిలో 20 శాతం కొరత ఉంది. ఆయుర్వేద విద్యనభ్యసించే వారికి పూర్తిస్థాయిలో బోధన జరగాలంటే కొరత లేకుండా పూర్తిస్థాయిలో నియమించాల్సి ఉంది.
తరగతి గదులు చాలడం లేదు
ప్రస్తుతం ఆయుర్వేద కళాశాల నిర్వహిస్తున్న భవనాన్ని ఏడు దశాబ్దాల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఆ భవనం శిథిలావస్థకు చేరింది. ఆయుర్వేద యూజీ సీట్లు కూడా పెరగడంతో విద్యార్థులు కూర్చునేందుకు తరగతి గదులు చాలని పరిస్థితి నెలకొంది. సర్దుబాటు చేసుకుని కూర్చోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. పలు తరగతి గదుల్లో కూర్చునేందుకు బెంచీలు సైతం ఉండటం లేదంటున్నారు. ప్రభుత్వం పట్టనట్లు చోద్యం చూస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
నిలిచిన ఔషధ మొక్కల పెంపకం
ఆయుర్వేద విద్యను అభ్యసించే వారు ఔషధ మొక్కలపై తరచూ పరిశోధనలు చేస్తుంటారు. దీనికనుగుణంగా కళాశాల ఆధ్వర్యంలో ఔషధ మొక్కలు పెంచాల్సి ఉంది. గతంలో కళాశాల ప్రాంగణంలోనే నర్సరీని కూడా నిర్వహించారు. ప్రస్తుతం ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడంతో ఔషధ మొక్కల పెంపకం నిలిచిపోయింది. దీంతో ఔషధ గుణాలున్న మొక్కలను గుర్తించే అవకాశాన్ని ఆయుర్వేద విద్యార్థులు కోల్పోతున్నారు. ఆయుర్వేద కళాశాలకు అనుబంధంగా కచ్చితంగా ఔషధ మొక్కలు పెంచాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో తరగతిలో పాఠాలు, ఆస్పత్రికి వచ్చే అరకొర రోగులకు వైద్య పరీక్షలు చేస్తూ కోర్సును పూర్తి చేస్తున్నారు.
నిధులు కేటాయించాలి
ఆయుర్వేద వైద్య విద్యార్థులకు తరగతి గదులు కూడా చాలినన్ని లేక పోవడం దురదృష్టకరం. బోధన చెప్పడానికి అవసరమైన వైద్యులను వెంటనే నియమించాలి. పరిశోధనల కోసం ఔషధ మొక్కలు పెంచేందుకు నిధులు కేటాయించాలి. అప్పుడే ఆయుర్వేద వైద్య విద్యను అభ్యసించేవారు నైపుణ్యం పెంచుకోగలుగుతారు.
–డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం
Comments
Please login to add a commentAdd a comment