భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆర్థిక స్వావలంబనతో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడంతోపాటు పది మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆకాంక్షించారు. గొల్లపూడిలోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో గురువారం జరిగిన స్వయం సహాయక బృందాల జిల్లా సమాఖ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన పేదరికాన్ని రూపుమాపడానికి మహిళలను ఆర్థిక సాధికారత వైపు నడిపించి వారు స్వయం సమృద్ధిని సాధించడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాల మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న పథకాలను వినియోగించుకోవడానికి మహిళలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి స్వయం సహాయక సంఘాల మండల, జిల్లా సమాఖ్య సభ్యులకు చేతి వృత్తులలో శిక్షణ అందించడంతోపాటు వారు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పీఎం ఈజీపీ, పీఎం ఎఫ్‌ఎంఈ, స్టాండప్ ఇండియా తదితరాలను ఉపయోగించుకుని ఆసక్తి ఉన్న యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది 10వేల యూనిట్ల ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నామని, వీటిల్లో దాదాపు 5వేల యూనిట్లు సెర్ఫ్–డీఆర్‌డీఎ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీఎ పీడీ కె శ్రీనివాసరావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కల్పన, ఎన్‌ఐఆర్డీ ప్రతినిధి మురళి, మండల జిల్లా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment