సరోగసీ దరఖాస్తుల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): సరోగసి విధానం(అద్దె గర్భం) కోసం దంపతులు చేసుకున్న దరఖాస్తులను బుధవారం నిర్వహించిన సరోగసీ యాక్ట్ జిల్లా బోర్డు సమావేశంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో ఐదుగురు దరఖాస్తు చేసుకోగా, వారి అర్హతలు, ఇతర అంశాలను వైద్య నిపుణులు పరిశీలించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ సౌజన్య, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పరుచూరి అనిల్‌కుమార్, గైనకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ టి.షర్మిల, నేషనల్ హెల్త్ మిషన్ డీపీఎంఓ డాక్టర్ నవీన్ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ బాస్కెట్ బాల్ జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల బాస్కెట్ బాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం జట్టును ఎంపిక చేసినట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన వెంకట అనిరుధ్, కోవెల గణేష్, శ్రీకర్ ప్రసాద్, క్రాంతిరుద్ర, తిరుమల వీరరాఘవరావు, నిహాంత్‌బాబు, వెంకటసాయి కమల్‌నాథ్, జాకబ్‌రాజు, సుధీర్‌కుమార్, మనోజ్, అహ్మద్‌ఖాన్, పవన్‌కల్యాణ్ జట్టులో చోటు దక్కించుకున్నారన్నారు. నవంబర్ ఒకటి నుంచి ఐదో తేదీ వరకు బెంగళూరులోని క్రైస్ట్ వర్సిటీలో జరిగే పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు. జట్టు బృందాన్ని వర్సిటీ వీసీ డాక్టర్ డి.వి.ఎస్.ఎల్.నరసింహం, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికరెడ్డి వర్సిటీ ప్రాంగణంలో బుధవారం అభినందించారు.
ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్పుకు అధ్యయనం చేయండి
అధికారులకు కృష్ణా కలెక్టర్ ఆదేశం
చిలకలపూడి(మచిలీపట్నం): డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే విధానంలో లోటుపాట్లపై అధ్యయనం చేసి వాహన దారులకు ఎంత ప్రయోజనకరమో పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ డీకే బాలాజీ రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్పు చేయడానికి అయ్యే వ్యయం తదితర ప్రయోజనాలపై చైన్నె నుంచి వచ్చిన కంపెనీ ప్రతినిధులు బుధవారం కలెక్టరేట్‌లో ఆటోలను ప్రదర్శించి కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం పాత డీజిల్ ఆటోలను విద్యుత్ వాహనాలుగా మార్పు చేసేందుకు అయ్యే వ్యయాన్ని బ్యాంకుల ద్వారా రుణాలు అందించటం, మార్పు చేసిన తరువాత వాహనాల మైలేజీ ప్రయోజనకరమైనదా, అవసరమైన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశాలు తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. సాధారణంగా విద్యుత్ వాహనాల వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ వచ్చే అవకాశం ఉందని, ఈ విషయంపై ఆటోవాలాలకు అవగాహన కల్పించటం ద్వారా వారి జీవనోపాధి మెరుగుపరచడానికి వీలవుతుందని కలెక్టర్ రవాణాశాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి జి.మనీష, మోటారు వాహన ఇన్‌స్పెక్టర్లు టీవీఎన్ సుబ్బారావు, సిద్ధిఖ్, బీఎస్‌ఎస్ నాయక్, సోనీ ప్రియ, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
దుర్గమ్మ సేవలో
నటుడు రఘుబాబు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ప్రముఖ సినీ నటుడు రఘుబాబు బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన రఘుబాబును ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం మహా మండపం రాజగోపురం వద్దకు విచ్చేసిన రఘుబాబుతో పలువురు భక్తులు, ఆలయ సిబ్బంది, ఫొటోలు, సెల్ఫీలు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment