వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న హాస్టళ్లపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడింది. దాంతో ఆయా హాస్టల్స్‌లో కొనసాగుతున్న విద్యార్థుల పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి. ఇటీవల గుడ్లవల్లేరు ఇంజినీ రింగ్ కళాశాల ఘటనతో ఉమ్మడి కృష్ణాజిల్లానే కాకుండా యావత్ రాష్ట్రం ఉలిక్కిపడింది. తరచుగా వివిధ హాస్టళ్లలో కొనసాగుతున్న ఆత్మహత్యల పర్వం ఆయా విద్యాసంస్థల్లో దిగజారుతున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. దానికితోడు గాలి వెలుతురు లేని పిచ్చుకగూళ్లులా ఉన్న హాస్టళ్ల వ్యవహారంపై ఏ ప్రభుత్వ శాఖ పట్టించుకున్న పాపాన పోవటం లేదు. ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థులే కాకుండా ఇంజి నీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులను అందిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు చాలా వరకూ ఉమ్మడి కృషా జిల్లాలో హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. వాటిలో చాలా వాటికి కనీస అనుమతులు లేవని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. హాస్టళ్లపై ప్రభుత్వానికి చెందిన ఏ ఒక్క శాఖకు అజమాయిషీ లేదు.
500 కళాశాలలు.. 100కు పైగా
మహిళా హాస్టళ్లు
ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రభుత్వ నివేదికల ప్రకారం 30 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. 80 వరకూ డిగ్రీ కళాశాలలు, మరో 25 వరకూ నర్సింగ్, బీఈడీ కళా శాలలు ఉన్నాయి. వాటితో పాటుగా సుమారు 300 వరకూ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అవి కాక ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు కూడా ఉన్నాయి. ఇంటర్మీడియెట్ ఆపై కోర్సులను అభ్యసిస్తున్న విద్యాసంస్థలకు సంబంధించి 125 నుంచి 150 వరకూ హాస్టళ్లు ఉమ్మడి కృష్ణాజిల్లాలో కొనసాగుతున్నాయి. హాస్టళ్ల అనుమతులు తమ పరిధిలో లేవంటున్నాయి జిల్లాలోని విద్యా, పోలీసు శాఖలు. విద్యాసంస్థలు, వాటి ప్రాంగణాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ చిన్నచిన్న భవనాలను అద్దెకు తీసుకొని పలు చోట్ల హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి.
ఏదేని ఘటన జరిగినప్పుడే హడావుడి
ఏదైనా సంఘటన జరిగి విద్యార్థులకు అనుకోని భారీ నష్టం జరిగినప్పుడు మాత్రమే పోలీసు శాఖ స్పందించి హడావుడి చేస్తుందని విద్యార్థి సంఘాలు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం పోలీసులు తమ పరిధిలో ఇన్ని హాస్టళ్లు ఉన్నాయి, వాటికి అనుమతులు ఉన్నాయా లేదా అని పోలీసులు స్పష్టంగా చెప్పలేక పోతున్నారని అంటున్నారు.
అనధికారికంగా హాస్టళ్లను నిర్వహిస్తున్న ప్రైవేట్ కళాశాలలు తమ పరిధిలో లేవంటున్న జిల్లా విద్యా, పోలీసు శాఖలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కళాశాలల యాజమాన్యాలు తరచూ ఆత్మహత్యలు, ఘర్షణలు జరుగుతున్నా పట్టని ప్రభుత్వం యాంటీ ర్యాగింగ్, ఇతర భద్రత చర్యలు శూన్యం
క్రమశిక్షణ కమిటీలు కాగితాలకే పరిమితం
హాస్టళ్లలో యాంటీ ర్యాగింగ్‌తో పాటుగా ఇతర క్రమశిక్షణకు సంబంధించిన కమిటీల అవసరం ఉంటుంది. కళాశాలల్లో ఈ విధమైన కమిటీల ఏర్పాటకు అప్పుడప్పుడు పోలీసు శాఖ నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకొంటోంది. కళాశాలలు సైతం పోలీసులు సూచించిన కమిటీలను వేసి వాటిని కాగితాలకే పరిమితం చేస్తున్నాయి. కనీసం ఒక్కసారి కూడా ఆ కమిటీలు సమావేశమై చర్చించిన దాఖలాలు లేవు. విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలకు పాల్పడుతూ విలువైన జీవితాలను బలి చేసుకుంటున్నారు. అందులోనూ విద్యార్థినుల హాస్టళ్ల విషయంలో పరిస్థితులు మరింత ఘోరంగా ఉన్నాయని ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment