ఉచిత ఇసుక విధానం అమలుకు పటిష్ట చర్యలు
కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలు కోసం పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉచిత ఇసుక విధానం కచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లో జేసీబీ, పొక్లెయిన్ వంటి యంత్రాలను ఉపయోగించకూడదని, కేవలం మనుషులతో మాత్రమే తవ్వకాలను చేపట్టాలన్నారు. ఈ విషయంలో నిబంధనలను ఉల్లంఘించిన వారి యంత్రాలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక తవ్వకాలకు స్థానికులకే అవకాశం కల్పించేలా చూడాలన్నారు. నదీ కట్టకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు కట్ట నుంచి 200 మీటర్ల అవతల తవ్వకాలు జరిగేలా చూడాలన్నారు. ఇందుకు గ్రామ సర్వేయర్ల సహకారంతో స్థానిక తహసీల్దార్లు ఇసుక తవ్వకాల ప్రాంతాల్లో మార్కింగ్ చేయాలన్నారు. ఒకే ప్రాంతంలో నిరంతరంగా ఇసుక తవ్వి భారీ గుంతలు ఏర్పడటానికి అవకాశం లేకుండా చూడాలన్నారు. అవసరం మేరకు మాత్రమే ఇసుకను తీసుకువెళ్లాలని అలా కాకుండా వ్యాపార ధోరణితో ట్రాక్టర్లతో ఎక్కడైనా ఇసుకను నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఆర్డీవోలు, ఎంపీడీవోలతో కూడిన డివిజన్, మండలస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జేసీ గీతాంజలిశర్మ, ఏఎస్పీ బి.సత్యనారాయణ, ఆర్డీవోలు కె.స్వాతి, బీఎస్ హేళషారోన్, మైన్స్ ఏడీ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్‌ఈ గంగయ్య, డీపీవో జె.అరుణ, డ్వామా పీడీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment