కిక్కు.. ఎక్కడికక్కడే!
బెల్ట్‌షాపుల విషయంలో సీఎం, అధికారులు చెబుతున్న మాటలు నీటి మూటలే అని.. క్షేత్రస్థాయిలో వేరుగా ఉందని తెలుస్తోంది. దీనికి నిదర్శనం ఊరూవాడ వెలుస్తున్న బెల్ట్‌షాపులే. దీంతో మందుబాబులకు ఎక్కడపడితే అక్కడ ‘కిక్కు’ వస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో పలుచోట్ల తెలుగు తమ్ముళ్లు బెల్ట్‌షాపులు ఏర్పాటు చేస్తున్నారు. అయినా అధికారులు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వస్తున్నాయి.
గుడివాడరూరల్: ‘గుడివాడ’లో ఎక్కడికక్కడే కిక్కు దొరుకుతోంది. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు వెలుస్తున్నాయి. బెల్ట్ షాపులు నిర్వహిస్తే తాటతీస్తామని సాక్షాత్తూ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించినా గుడివాడలో పచ్చ తమ్ముళ్లు బేఖాతర్ చేస్తున్నారు. నిత్యం జనసంచారం ఉండే పట్టణంలోని బంటుమిల్లి రోడ్డును అనుకుని బెల్ట్‌షాపును ఏర్పాటు చేసి వైన్‌షాపులను తలదన్నేలా మద్యం విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎకై ్సజ్, పోలీసులు కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ ఏర్పడిన తర్వాత
బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఎమ్మెల్యేలను సైతం బెల్టుషాపుల విషయంలో కఠినంగా ఉండాలంటూ ఆదేశించారు.
సీఎం ఆదేశాలు బేఖాతర్
పార్టీ అధినేత, సీఎం ఆదేశాలను గుడివాడలో పసుపు నేతలు తుంగలో తొక్కారు. ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరులమంటూ నిత్యం వ్యాపారాలు జరిగే బంటుమిల్లి రోడ్డులో బెల్ట్ షాపును ఏర్పాటు చేశారు. చిత్రం ఏమిటంటే లైసెన్స్ షాపుల మాదిరిగా బెల్టు షాపులోనూ డిజిటల్ పేమెంట్ చేయడానికి స్కానర్లను సైతం ఏర్పాటు చేశారంటే ఎంత దారుణంగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయో అర్థమవుతుంది. పరిసర ప్రాంతాల వారు నిత్యం అవసరాల నిమిత్తం ఆ రోడ్డుకు వస్తుంటారు. సరుకులు కొనుగోలు చేయాలంటే ఇదే ప్రాంతం మీదుగా మహిళలు వెళ్లాలి. బెల్టుషాపు ఏర్పాటుతో మందుబాబులు చేసే హడావుడి అధికమైంది. దీంతో మహిళలు, వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే బిళ్లపాడులో రెండు చోట్ల బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. చినఎరుకపాడులో కూడా బెల్ట్ షాపు ఏర్పాటు చేశారు.
ప్రశ్నిస్తే దౌర్జన్యమే
బెల్ట్ షాపునకు అనుమతులు లేవు ఎందుకు నిర్వహిస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ‘తమ్ముళ్లు’ దౌర్జన్యానికి దిగుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా అమ్మకాలు సాగిస్తుండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్నవారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతంలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం తెలియదని, ఇంత అడ్డగోలుగా షాపు ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నా అధికారుల్లో స్పందన లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే అనుచరుల కనుసన్నల్లోనే..!
ఇది అంతా ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరుల కనుసన్నల్లోనే కొనసాగుతుండటంతో అధికారులు మాత్రం ప్రలోభాలకు తలొగ్గి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి ఆ ప్రాంత ప్రజలు బెల్ట్ షాపు నిర్వహణపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు బెల్ట్ షాపును తొలగించాలంటూ ఆదేశాలు ఇచ్చినా నిర్వాహకులు పెడచెవిన పెట్టారు. తగ్గేదే లేదంటూ షాపును నిర్వహిస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న బెల్ట్ షాపును తొలగించి సీఎం ఆదేశాలు అమలు చేయాలని కోరుతున్నారు.
‘గుడివాడ’లో జన సంచారాల మధ్య బెల్ట్‌షాపు మాజీ ఎమ్మెల్యే అనుచరులే నిర్వాహకులు! సీఎం మాటలు నీటి మూటలు పగలు రాత్రి తేడా లేకుండా అమ్మకాలు చోద్యం చూస్తున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment