ముగ్గురు మైనర్లు తండ్రి చెంతకు..
కోనేరుసెంటర్: కనిపించకుండా పోయిన ముగ్గురు మైనర్లను తండ్రి చెంతకు చేర్చారు పోలీసులు. పిల్లలు అద్యశ్యమైన 24 గంటల్లో కేసును చేధించి పోలీసు ప్రతిష్టను మరింత పెంచారు. ఈ కేసుకు సంబంధించి బందరు డీఎస్పీ అబ్దుల్ సుభాన్ ఆదివారం రాత్రి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వ్యవసాయ పనులు చేసుకునే మచిలీపట్నం కాలేఖాన్‌పేటకు చెందిన తుమ్మ రాఘవులుకు తుమ్మ శ్రీనివాసులు (8), దుర్గారావు (6), నాగేశ్వరరావు (3) అనే ముగ్గురు సంతానం ఉన్నారు. అతని భార్య ఆరు నెలల క్రితం అనారోగ్యంతో కన్ను మూసింది. అప్పటి నుంచి రాఘవులు ఆ ముగ్గురు పిల్లలను సాకుతున్నాడు. ఈ నెల ఒకటో తేదీన అతను పని నిమిత్తం అవనిగడ్డలోని తల్లి ఇంటికెళ్లాడు. పిల్లలు ముగ్గురూ తండ్రి కనిపించకపోవడంతో ఆటలాడుతూ ఇంటి నుంచి బయటికెళ్లారు. అలా ముగ్గురూ కాలేఖాన్‌పేట మీదుగా అవనిగడ్డ వైపు నడుచుకుంటూ వెళ్లారు. మచిలీపట్నం నుంచి దాదాపు పది కిలోమీటర్ల దూరం వెళ్లి చల్లపల్లి మండలం జీలగలగండి సమీపంలో రోడ్డుపై నిలబడి ఏడుస్తున్నారు. ఆ సమయంలో గుడివాడ నుంచి అవనిగడ్డ వైపు వెళ్తున్న అయ్యప్ప అనే వ్యాను డ్రైవర్ ఏడుస్తున్న పిల్లలను చూసి జాలితో వాహనం ఆపాడు. పిల్లలు ముగ్గురిని దగ్గరకు తీసుకుని ఎందుకు ఏడుస్తున్నారంటూ అడిగాడు. తండ్రి కనిపించడంలేదంటూ బదులిచ్చిన పిల్లల నుంచి ఇంటి అడ్రస్ తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. పిల్లలను వదిలేయలేక వ్యానులో అవనిగడ్డ తీసుకెళ్లాడు. లోడు దింపిన అనంతరం వారికి టిఫిన్లు పెట్టించి తిరుగు ప్రయాణమయ్యాడు. బందరు సమీపానికి వచ్చిన అయ్యప్ప మళ్లీ పిల్లలను ఇంటి అడ్రస్ అడిగాడు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో కాలేఖాన్‌పేటలో వాళ్లను దింపి ఇంటి అడ్రస్ కోసం ప్రయత్నించాడు. పిల్లలు చెప్పలేకపోవడంతో అయ్యప్ప ముగ్గురిని వ్యానులో నందివాడలోని తన ఇంటికి తీసుకెళ్లాడు.
రంగంలోకి 20 ప్రత్యేక బృందాలు
తండ్రి తుమ్మ రాఘవులు ఫిర్యాదు మేరకు ఈ నెల 2వ తేదీన ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విషయం తెలుసుకున్న ఎస్పీ గంగాధర్‌రావు పిల్లల ఆచూకీ తెలుసుకునేందుకు బందరు నుంచి 10, అవనిగడ్డ నుంచి 5, సీసీఎస్ నుంచి మరో 5 కలిపి మొత్తం 20 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వారు పిల్లల ఆచూకీ కోసం జల్లెడ పట్టారు. ఎట్టకేలకు పిల్లలు వ్యానులో అవనిగడ్డ వైపు వెళ్లినట్లు తెలుసుకున్న డీఎస్పీ అబ్దుల్ సుభాన్ అక్కడి పోలీసులతో మాట్లాడి వ్యాన్ డ్రైవర్ అయ్యప్ప ఫోన్ నంబర్‌ను సంపాదించారు. వారు అయ్యప్పకు ఫోన్ చేసి పిల్లల గురించి ఆరా తీశారు. వారు తన వద్దే ఉన్నట్లు అతను చెప్పటంతో నందివాడ పోలీసులను అప్రమత్తం చేశారు. వారు అక్కడకు చేరుకుని ముగ్గురు పిల్లలను తీసుకుని ఆదివారం రాత్రి అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు.
●తప్పిపోయిన ముగ్గురు మైనర్‌లను చాకచక్యంగా పట్టుకున్న 20 ప్రత్యేక బృందాలను జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. పోలీసుశాఖ ప్రతిష్ట మరింత పెరిగేలా చేసిన సిబ్బందికి ఆయన రివార్డులను ప్రకటించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఇనగుదురుపేట సీఐ పరమేశ్వరరావు, ఎస్సై శ్రీనివాసు ఇతర అధికారులు పాల్గొన్నారు.
24 గంటల్లోనే పిల్లల ఆచూకీ లభ్యం జిల్లాలో 20 ప్రత్యేక బృందాలతో గాలింపు ప్రత్యేక బృందాలకు ఎస్పీ అభినందనలు
Comments
Please login to add a commentAdd a comment