నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో చేపట్టిన ఇంజినీరింగ్ పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆయన చాంబర్‌లో మంగళవారం ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఉపాధిహామీ పథకం కింద రూ.163.17 కోట్లతో సిమెంటు రహదారులు, ప్రహరీలు, కాలువలు, షెల్టర్ల నిర్మాణానికి 2043 పనులు మంజూరు చేశామన్నారు. ఇందులో 67 శాతం పనులు ప్రారంభించామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సత్వరమే ప్రారంభించాలన్నారు. కాంట్రాక్టర్లను ఎక్కువ మందిని వినియోగించి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. చేసిన పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసి బిల్లులు చెల్లించేలా చూడాలన్నారు. పనుల నాణ్యతలో రాజీపడరాదని హెచ్చరించారు.
గుంతలు లేని రహదారుల నిర్మాణమే లక్ష్యం
ఎంపీ నిధుల ద్వారా రూ.16.13 కోట్లతో 254 పనులు మంజూరు చేశామని కలెక్టర్ బాలాజీ చెప్పారు. వీటిలో 211 పనులు పూర్తయ్యాయని, మిగిలినవి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లా ఖనిజాల ఫౌండేషన్ ట్రస్ట్ నిధుల ద్వారా రూ.6.82 కోట్లతో 108 పనులు మంజూరు చేయగా 74 పనులు ప్రారంభించారని మిగిలిన పనులు సత్వరమే ప్రారంభించాలన్నారు. సీఎస్‌ఆర్ నిధుల ద్వారా రూ.16.28 కోట్లతో చేపట్టిన పనులు త్వరగా ప్రారంభించి, పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారులు, భవనాల శాఖ ద్వారా గుంతలు లేని రహదారుల నిర్మాణమే లక్ష్యంగా జిల్లాలో 45 పనులు మంజూరు చేయటం జరిగిందని ఇవన్నీ పురోగతిలో ఉన్నాయని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, డ్వామా పీడీ శివప్రసాద్ యాదవ్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రమణారావు, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment