మసకబారిన మత్స్యకారుల సంక్షేమం!
నాగాయలంక: కూటమి ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమం మసకబారింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మత్స్యకారుల కుటుంబాల్లో ఆవిష్కృతమైన కొత్త వెలుగులు ప్రస్తుతం కనుకరుగమవుతున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో తొమ్మిది రూపాయల ఆయిల్ సబ్సిడీతో నెలకు 300 లీటర్లు ఇచ్చారు. ఆమేర సబ్సిడీ వరకు తగ్గించి ఎంపిక చేసిన పెట్రోలు బంకుల్లో నేరుగా ఆయిల్ తీసుకునే సదుపాయం కూడా కల్పించారు. చేపలవేట నిషేధకాలంలో రూ.4 వేలు ఉన్న భృతిని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద ఏకంగా రూ.10 వేలకు పెంచి సకాలంలో సాయం అందించింది. కానీ కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఈ ఏడాది జీవనభృతి నవంబరు వచ్చినా అందకపోవడంపై లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. వేట నిషేధ కాలంలో చెల్లించాల్సిన జీవనభృతి తక్షణం ఇవ్వాలని మత్స్యకారులు కోరుతున్నారు.
దివిసీమలో పరిస్థితి ఇదీ....
దివిసీమలోని నాగాయలంక, కోడూరు మండలాల్లో సంగమేశ్వరం నుంచి నాలి, సొర్లగొంది, దీనదయాళపురం, పర్రచివర, ఏటిమొగ, గుల్లలమోద, ఎదురుమొండి దీవుల్లోని ఈలచెట్లదిబ్బ, నాచుగుంట, ఎదురుమొండి, నాగాయలంక, పాలకాయతిప్ప, బసవవానిపాలెం, హంసలదీవి తదితర గ్రామాల్లో బంగాళాఖాతం, కృష్ణానదిలో అత్యధిక మత్స్యకార కుటుంబాలు నిత్యం చేపలవేట సాగిస్తున్నాయి. దివిసీమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల కుటుంబాలకు పైగా మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. కృష్ణానది తీరంలోని నాగాయలంకలో దశాబ్దాల కాలంగా ప్రతి ఆదివారం (ఇపుడు శనివారమే ముగుస్తుంది) జరిగే వారపుసంతలో డ్రై ఫిష్ అమ్మకాలు మత్స్యకార మహిళల బతుకు వైవిద్యాన్ని ప్రతిబింబిస్తుంటాయి. అవనిగడ్డ డివిజన్ పరిధిలో 17,844.26 ఎకరాల్లో ఆక్వా సాగు (చేపలు, రొయ్యలు, పీతలు) జరుగుతుంటే ఆక్వా జోన్‌లో 11,362.19 ఎకరాలు, నాన్ ఆక్వా జోన్‌లో 6,554.07 ఉన్నాయి. ఆక్వా జోన్‌లోని 1042ఎకరాలకు ఆక్వా విద్యుత్ యూనిట్‌కి రూ.1.50 ఆక్వా సబ్సిడీ లభిస్తుంది. గత ప్రభుత్వం అవనిగడ్డలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ ఆక్వాలాబ్, మొబైల్ ఆక్వాలాబ్‌ల ద్వారా మట్టి, నీటి పరీక్షలు కొనసాగుతున్నాయి. కృష్ణానది, డ్రెయిన్‌లలో వేట సాగించే 1481 మందికి లైసెన్స్‌లు ఇవ్వడం జరిగిందని ఫిషరీస్ అధికారులు తెలిపారు. రికార్డుల మేరకు 1163 బోట్‌లకు సముద్రంలో వేట సాగిస్తున్నాయి.
నవంబరు నెల ముగుస్తున్నా ఇంకా
అందని నిషేధ కాలం జీవనభృతి
దివసీమ తీరంలో మత్స్య పరిశ్రమపై
ఆధారపడిన 15 వేల కుటుంబాలు
రేపు ప్రపంచ మత్స్య దినోత్సవం
సందర్భంగా ప్రత్యేక కథనం
ఇప్పటివరకు భృతి అందలేదు
వేట నిషేధం ముగిసి ఐదు మాసాలు గడుస్తున్నా ఇంత వరకు భృతి అందించలేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జీవనభృతిని రూ.20 వేలకు పెంచారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తూచ తప్పకుండా ప్రతి ఏడాది ఏప్రిల్ నెలాఖరు నాటికి అర్హులందరి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవాళ్లు. దేశంలోని అన్ని కోస్తా రాష్ట్రాలు నిర్ణీత సమయానికే వేట విరామ భృతి చెల్లిస్తున్నాయి. కానీ ఏపీలో నవంబర్ వచ్చినా భృతి ఇవ్వలేదు.
లకనం నాగాంజనేయులు,
ఏపీ సంప్రదాయ మత్స్యకారుల సేవా సమతి ప్రధాన కార్యదర్శి
ప్రతిపాదన పంపించాం
దివిసీమ తీరంలో దరిదాపు 15 వేల కుటుంబాలు ప్రత్యక్ష, పరోక్షంగా మత్స్యపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. 1163 నావలకు ఆయిల్ సబ్సిడీ రూ.9 ఇస్తున్నాం. ఈ ఏడాది 5869 మంది లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాం. సీఎస్‌ఆర్ ఫండ్స్ నుంచి 280 ఐస్ బాక్స్‌లు ఇచ్చాం. నాగాయలంక మండలం గుల్లలమోద, సొర్లగొంది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ సీసీఆర్‌సీఎఫ్ కింద జెట్టీలు, ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పాటుకు రూ.4 కోట్లు మంజూరయ్యాయి.
ఆర్. ప్రతిభ,
మత్స్యశాఖ సహాయ సంచాలకురాలు
Comments
Please login to add a commentAdd a comment