కంకిపాడులో ఉద్రిక్తత
కంకిపాడు: వైఎస్సార్ సీపీ నేతల అరెస్టుతో కంకిపాడులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి సర్కారు ఆదేశాలను పాటిస్తూ పోలీసులు తమదైన శైలిలో వ్యవహరించటం వివాదాస్పదం అయింది. మంగళవారం చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే... గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రధాన అనుచరులు ఒ.మోహనరంగా, ఎంపీపీ అనగాని రవి, బిహెచ్ యతీంద్ర రామకృష్ణ (రాము), మేచినేని బాబు, సూరపనేని అనిల్, గొన్నూరి సీమయ్య, గుర్రం నాని, కె.నిరంజన్‌కుమార్‌లను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేసి కంకిపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అదనపు ఎస్పీ వీవీ నాయుడు, డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో గన్నవరం, కంకిపాడు, ఉయ్యూరు సీఐలు, ఎస్‌ఐలు పోలీసుస్టేషన్ పరిసరాల్లో భారీ బందోబస్తు నిర్వహించారు. ఎన్నడూ లేనివిధంగా పోలీసులు వైఎస్సార్ సీపీ నేతల అరెస్టు వ్యవహారంలో వ్యవహరించారు. పోలీసుస్టేషన్ రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటుచేసి ఆ వైపుగా ఏ ఒక్కరూ వెళ్లకుండా గస్తీ ఏర్పాటు
చేశారు.
స్టేషన్ తలుపులు మూసి...
పోలీసుస్టేషన్ పరిసరాల్లో 144 సెక్షన్ మాదిరిగా బందోబస్తు చర్యలు తీసుకున్నారు. పోలీసు అధికారులు స్టేషన్‌కు తలుపులు వేసి రోడ్డు మీద కాపలా కాయటం విడ్డూరం. అరెస్టయిన వైఎస్సార్ సీపీ నేతలను పరామర్శించేందుకు గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ సీపీ నేతలు భారీగా చేరుకున్నారు. పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఇతర నేతలు స్టేషన్ రోడ్డులోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కమ్మ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రామినేని రమాదేవి స్టేషన్‌లో ఉన్న తమ నేతలను కలుస్తానని, కాళ్లు పట్టుకుంటా ఒప్పుకోండి అంటూ బతిమాలారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి వణికిపోమని, భయపడేది లేదని వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి అన్నారు. మాజీ ఎంపీపీ మాదు శ్రీహరిరాణి, అనగాని రవి తనయుడు సుందర్ చైతన్య, ఎంపీటీసీ చిట్టూరి ప్రసాద్, నేతలు శీలం రంగారావు, పిడికిటి రామకోటేశ్వరరావు, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ నేతల అరెస్టు
పరామర్శకు వెళ్లనీయకుండా అడ్డగింత
స్టేషన్ రోడ్డులో బారికేడ్లు ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment