నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి వేలమూరు గ్రామవాస్తవ్యులు కోయ వెంకట గౌరీ రత్నకుమారి రూ. 1,01,116 విరాళంగా ఆలయ సూపరిటెండెంట్ బొప్పన సత్యనారాయణకు అందజేశారు. మంగళవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు బుద్ధు సతీష్‌శర్మ సమక్షంలో ఈ విరాళాన్ని నగదు రూపంలో అందించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ అధికారులు బర్మా ప్రసాద్, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేత
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఘాట్‌రోడ్డులో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు కొండపైకి ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదని ఆలయ ఈవో కెఎస్.రామరావు తెలిపారు. ఘాట్‌రోడ్డులో కొండ రాళ్లు జారిపడకుండా రక్షణ చర్యల్లో భాగంగా పనులు జరుగుతున్నాయి. పనులు వేగవంతంగా చేపట్టేందుకు మూడు రోజుల పాటు ఘాట్‌రోడ్డులో రాకపోకలను పూర్తిని నిలిపివేస్తామని అధికారులు పేర్కొన్నారు. 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఘాట్‌రోడ్డు మీదగా సాధారణ భక్తులతో పాటు వీఐపీలను అనుమతించబోమని స్పష్టం చేశారు. భక్తులందరూ కనకదుర్గనగర్, మహా మండపం మీదగా లిప్టు, మెట్ల మార్గం ద్వారా అమ్మవారి ఆలయ ప్రాంగణానికి చేరుకుని క్యూలైన్లలో దర్శనానికి వెళ్లాలని సూచించారు.
పాఠశాలలను సందర్శించిన ప్రపంచ బ్యాంకు బృందం
ఉంగుటూరు: గన్నవరం నియోజకవర్గంలోని ఆత్కూరు, దావాజిగూడెంలో పాఠశాలలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించింది. సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో బృందం ఆత్కూరులో అన్నే సీతారామయ్య జెడ్పీ హైస్కూల్, దావాజీగూడెంలో మోడల్ ఫౌండేషన్ పాఠశాలలను సందర్శించారు. పాఠశాలలో విద్యావిధానాలు, విద్యార్థుల అభ్యాస పద్ధతులు, సృజనాత్మకత, విద్యా ప్రమాణాలు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలను సమీక్షించారు. అనంతరం విద్యార్థులతో మమేకమయ్యారు. ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు చక్కని సమాధానాలిచ్చి ఆకట్టుకున్నారు. తరగతి గదులను సందర్శించి ఉపాధ్యాయ బోధన పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యాభివృద్ధికి విద్యాశాఖ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశంసించారు. ఆర్థికవేత్త, టాస్క్ టీమ్ లీడర్ క్రిస్టెల్, దక్షిణ ఆసియా ప్రతినిధి కికో ఇనోయూ, జుంకో ఒనిషి (లీడ్ సోషియల్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్, హ్యూమన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ లీడర్ ఇండియా), డి.హెచ్.సి. అటూరుపనే (లీడ్ ఆర్థికవేత్త), కార్తిక్ పెంటల్ (సీనియర్ ఎడ్యూకేషన్ స్పెషలిస్ట్), తనుజ్ మథూర్ (సీనియర్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్), కన్సల్టెంట్ ప్రియంకా సాహూ, మన బడి మన భవిష్యత్తు జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం, శామో అడిషనల్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు, ఎస్సీఈఆర్డీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి, ఏపీఈడబ్ల్యూడీసీ ఎంపీ దివాన్‌రెడ్డి, డీఈవో రామారావు, సత్త్వాకై వల్య టీచ్ టూల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఔట్‌సోర్సింగ్ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని యూనియన్ కోశాధికారి ఎన్.సునీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో పనిచేస్తూ గురుకులాలు రూపొందించే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నామన్నారు. గత వది సంవత్సరాల నుంచి తమ సమస్యలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ నేతలు మల్లిఖార్జున నాయక్, యన్ పరమేష్, యం.విజయ్ కుమార్ నాయక్, జి. బ్రహ్మయ్య, టీచర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment