ప్రమాదాల నివారణకు పటిష్ట భద్రత ఏర్పాట్లు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని మంగళవారం సాయంత్రం ఆయన చాంబర్‌లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గత నెలలో జిల్లాలో రహదారి ప్రమాదాలు తగ్గాయన్నారు. ప్రమాదాలు జరిగే 61 బ్లాక్ స్పాట్‌లు గుర్తించి, అందులో 13 మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా నియంత్రించామని చెప్పారు. రానున్న సమావేశంలోగా జాతీయ రహదారిపై ఉన్న మిగిలిన 13 బ్లాక్ స్పాట్‌లలో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నెలకోసారి సమావేశం నిర్వహిస్తున్నప్పటికీ జాతీయ రహదారులకు సంబంధించి గత నెలలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై సరైన సమాచారంతో రాకపోవటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
రూ.80 లక్షల మేర ప్రతిపాదనలు
మచిలీపట్నం నగరంతో పాటు పెడన, గుడివాడ, ఉయ్యూరు, వైఎస్సార్ తాడిగడప మున్సిపాల్టీల పరిధిలో విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ప్రార్థనా మందిరాల వద్ద సూచికలు ఏర్పాటు కోసం రూ.80 లక్షల మేర ప్రతిపాదనలు రవాణాశాఖ కమిషనర్‌కు పంపామని కలెక్టర్ బాలాజీ చెప్పారు. బందరు డీఎస్పీ అబ్దుల్ సుభానీ మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి మార్గంలో టోల్‌ప్లాజా దగ్గర రోడ్డు ప్రమాదంలో పోలీస్ చనిపోయారన్నారు. సంబంధిత సీసీ ఫుటేజీలు కోరితే లేవని చెప్పారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్‌రెడ్డి, జిల్లా రవాణాధికారి శ్రీనివాసనాయక్, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేష్, ఆర్టీసీ డీఎం పెద్ది రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment