బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ అలంకార్ సెంటర్‌లో మంగళవారం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ రిటైరీస్ ఆర్గనైజేషన్ (యుఎఫ్‌బీఆర్వో) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 500 మంది రిటైర్డ్ ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. పెన్షన్ మెరుగుపరచాలని, దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ధర్నానుద్దేశించి ఎఐబీఆర్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్‌నాయక్ మాట్లాడుతూ బ్యాంక్‌లు జాతీయం చేసిన నాటి నుంచి దేశాభివృద్ధికి బ్యాంక్‌లు చేసిన సేవలను వివరించారు. 1993 నుంచి ఇప్పటి వరకు పెన్షన్ అప్‌డేట్ చేయలేదని, ఇది ప్రభుత్వాలు, బ్యాంకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు.
పన్నులు విధించడం అన్యాయం..
ఎం.ఎన్. రావు మాట్లాడుతూ బ్యాంక్ రిటైర్ ఉద్యోగులు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించాలని, ఆరోగ్య బీమా ప్రీమియంలో కనీసం 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తం బ్యాంకులే భరించాలన్నారు. పాత పెన్షన్ అప్‌డేట్ చేయకుండా పన్నులు విధించడం అన్యాయమని చెప్పారు.
ఏపీ బీఆర్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బీవీవీ కొండలరావు మాట్లాడుతూ.. రిటైర్ ఉద్యోగుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం బాధాకరమన్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో పెన్షన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మద్దతు తెలిపారు. ధర్నాలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎల్లారావు, వి.జగన్‌మోహన్‌రావు, బి.ఆంజనేయరాజు, ఎంబీ శంకరరావు, పి.వీరారెడ్డి, చంద్రశేఖర్, హరిబాబు, రాజేశ్వరరావు, రామచంద్రరావు, నారాయణరావు, నరేంద్రదేవ్, కామేశ్వరరావు, ఏ.రమణ, ఎంఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment