అక్రమం.. అరాచకం.. | - | Sakshi
Sakshi News home page

అక్రమం.. అరాచకం..

Published Sun, Nov 24 2024 4:04 PM | Last Updated on Sun, Nov 24 2024 4:04 PM

అక్రమం.. అరాచకం..

అక్రమం.. అరాచకం..

పాలకులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తే అరాచకత్వం స్వైర విహారం చేస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జరుగుతోంది అదే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటుతోంది. పాలకులు వైఎస్సార్‌ సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలతో చెలరేగిపోతున్నారు. పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారు. కూటమి పాలకుల వికృత చేష్టలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారని పలువురు వాపోతున్నారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతోంది. గతంలో కొన్నేళ్ల క్రితం జరిగిన చిన్న చిన్న ఉదంతాలను వక్రీకరిస్తూ అక్రమ కేసులను నమోదు చేస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని కేసులు బనాయిస్తోంది. నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. సోషల్‌ మీడియా పోస్టులతో సంబంధం లేకుండా వాట్సప్‌ గ్రూపులో ఉన్న వారందరికి నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనరేట్‌.. సోషల్‌ మీడియా కేసుల నమోదులో రాష్ట్రంలోనే టాప్‌లో ఉంది. టీడీపీ కుట్రను వెల్లడించేలా.. ఇటీవల వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలపై కక్షపూరితంగా తీసుకున్న చర్యలు ఇలా ఉన్నాయి.

నందిగామలో అడ్డు అదుపూ లేకుండా...

నందిగామలో పోలీసులపై కూటమి నేతలు ఒత్తిడి తెచ్చి, అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. 2022, నవంబరు 4న చంద్రబాబునాయుడు నందిగామలో బాదుడే బాదుడు కార్యక్రమానికి హాజరయ్యారు. చంద్రబాబు సెక్యూరిటీపై రాళ్ల దాడి జరిగిందిని అప్పట్లో హడావుడి చేశారు. పోలీసులు కేసు విచారణ చేసి చెట్ల కొమ్మలు గీసుకుని పూలు విసరడంతో అందులోనుంచి పొరపాటున చిన్నరాయి వచ్చి ఉండొచ్చని దాడితో ఎవరికీ సంబంధం లేదని స్పష్టంచేశారు. ఇప్పుడు ఆ కేసును తిరగదోడి, వైఎస్సార్‌ సీపీ నాయకులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పరిమి కిషోర్‌, బెజవాడ కార్తీక్‌, సతీష్‌రెడ్డి, పరిటాలకు చెందిన మార్త శ్రీనివాసరావు, కన్నెకంటి సజ్జనరావును శనివారం అరెస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లను అరెస్ట్‌ చేసి వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

● కంచకచర్ల మండలం కీసరలో గణేష్‌ నిమజ్జనం ఊరేగింపులో వైఎస్సార్‌ సీపీ వారిని, టీడీపీ నేతలు అడ్డుకొని దాడిచేసి కొట్టడమే కాకుండా, పోలీసులతో అక్రమంగా 21 మందిపైన హత్యాయత్నం కేసు నమోదు చేయించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

● ఇటీవల కంచికచర్ల మండలం పెండ్యాలలో ఎంపీపీ షేక్‌ బషీర్‌ కారుకు టీడీపీ నాయకులు బైకును అడ్డుగా పెట్టారు. వాహనాన్ని తీయాలని అడిగిన ఘటనను ఆసరా చేసుకొని వైఎస్సార్‌ సీపీ వారిపై టీడీపీ నేతలే దాడి చేశారు. దాడికి గురైన బాధితులు ఏడుగురిపైన పోలీసులు అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు చేసి, ఆరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. దాడి చేసిన టీడీపీ నేతలపై నామమాత్రంగా 324 కేసు కట్టి చేతులు దులుపుకొన్నారు.

● ఈ ఏడాది టీడీపీ నేత కాసరనేని రంగబాబుపై దాడి చేసిన ఘటనలో బాధ్యులైన ఆరుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారు. ఇటీవల ఆ అంశాన్ని చూపి మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రధాన అనుచరులైన తొమ్మిది మందిపై అక్రమ కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని కంకిపాడు పీఎస్‌ తరలించి, రాత్రికి గన్నవరం కోర్టులో హాజరు పరిచారు.

గన్నవరంలో ఆగని కక్ష సాధింపు

కృష్ణా జిల్లా గన్నవరం నియోజక వర్గంలో కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయి. మాజీ ఎమ్మెల్యే వంశీ, ఆయన ప్రధాన అనుచరులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన ఘటనను ఆధారంగా చేసుకున్నారు. ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా పని చేసిన ముఖ్య నేతలపై కక్ష సాధింపులో భాగంగా 71 మందిపై కేసులు నమోదు చేసి వేధించారు. టీడీపీ ఆఫీసు దాడి ఘటనలో కవ్వింపులకు పాల్పడటంతోపాటు, పోలీసులపై దాడి చేసి, రెచ్చగొట్టింది టీడీపీ నాయకులే కావడం గమనార్హం. ఘటనతో సంబంధంలోని పలువురు వైఎస్సార్‌ సీపీ నేతలను ఇబ్బందులకు గురి చేశారు.

గుడివాడలో..

గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిపై వలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారని వారితో టీడీపీ నాయకులే తప్పుడు ఫిర్యాదు చేయించి అక్రమ కేసు బనాయించారు. లిక్కర్‌ లీజు వ్యవహారంలో టీడీపీ నాయకుడు తప్పుడు ఫిర్యాదు చేసి, కొడాలి నానిపై కేసు నమోదు చేయించారు. సోషల్‌ మీడియాకు సంబంధించి రాష్ట్రంలో అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనరేట్‌లో 81 కేసులు నమోదు చేశారు. వందలాది మందికి నోటీసులు ఇచ్చారు. వీరిని స్టేషన్‌లకు పిలిపించి, వేధింపులకు గురిచేస్తున్నారు.స్టేషన్‌ల చుట్టూ తిప్పుతూ థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ఇలా రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో భాగంగా టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ కక్ష సాధింపులకు పాల్పడుతోంది.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ‘కూటమి’ కక్ష సాధింపులకు పరాకాష్ట గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రధాన అనుచరుల అరెస్టు నందిగామలో కొనసాగుతున్న వేధింపుల పర్వం తాజాగా పలువురు వైఎస్సార్‌ సీపీ నేతల అక్రమ అరెస్టు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement