దుర్గమ్మ భక్తులకు వసతి కరువు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దర్శ నానికి విచ్చేసే భక్తులు ఉండేందుకు సత్రాలు, కాటేజీలను అందుబాటులోకి తీసుకురావాలని దాతలు ఆశించారు. ఇందు కోసం కోట్ల రూపాయల విలువైన సత్రాలు, స్థలాలను ఆలయానికి చెందేలా వీలునామాలు రాశారు. అయితే ఆలయ అధికారుల తీరుతో దుర్గమ్మ భక్తులకు వసతి సదుపాయం కరువైంది. కోట్ల రూపాయల విలువైన సత్రాలు, కాటేజీలు ఉన్నా అమ్మ భక్తులు అధిక మొత్తంలో చెల్లించి ప్రయివేటు సత్రాలు, గదులను అద్దెకు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దుర్గమ్మ దర్శనానికి నిత్యం 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు వస్తారు. ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసే భక్తులు 15 వేల మంది వరకు ఉంటారు. వారు వసతి పొందేందుకు దేవస్థానానికి చెందిన ఏ ఒక్క కాటేజీ పూర్తి సౌకర్యాలతో అందుబాటులో లేదు. కాటేజీల్లో వసతులు లేకపోవడంతో ఆలయ పరిసరాల్లోని ప్రయివేటు హోటళ్లు, గదులను భక్తులు అద్దెకు తీసుకోవాల్సి వస్తోంది.
నిరుపయోగంగా సత్రాలు
దుర్గమ్మ భక్తుల కోసం సి.వి.రెడ్డి కోట్ల రూపాయల విలువైన స్థలాలను దేవస్థానానికి అందజేశారు. ఈ స్థలంలో దేవస్థానం రూ.9 కోట్లు వెచ్చించి కాటే జీలు నిర్మించింది. రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో, పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌కు అత్యంత సమీపంలో ఉన్న ఈ కాటేజీలో సరైన వసతులు కల్పించి ఉంటే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. భవానీ దీక్షవిరమణకు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులకు ఇక్కడ చక్కటి పార్కింగ్ సదుపాయం ఉంటుంది. ఇక్కడ చిన్న తరహా వాహనాలను అనుమతించి అక్కడి నుంచి దేవస్థానానికి బస్సులు అందుబాటులో ఉంచి ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. రైల్వే స్టేషన్‌కు సమీపంలో దేవస్థానానికి చెందిన మాడపాటి సత్రం ఉంది. ఈ సత్రం బయటకు కార్పొరేట్ స్థాయి హోటల్‌లా ఉన్నా లోపల సరైన సదుపాయాలు కనిపించవు. ఐదు సూట్‌రూమ్‌లు, 13 సాధారణ గదులున్నాయి. ఇక్కడ గదులు అద్దెకు తీసుకునే భక్తులు తాగు నీటిని బయట నుంచి తెచ్చుకోవాలి. బ్రాహ్మణ వీధిలో దేవస్థానానికి చెందిన జమ్మిచెట్టు కార్యాలయం పరిస్థితీ ఇంతే. మూడు అంతస్తుల భవనంలో మొదటి అంతస్తును మంత్రి క్యాంప్ ఆఫీస్‌గా ఉపయోగిస్తున్నారు. మిగిలిన రెండు ఫ్లోర్లలో సూట్ రూములు నాలుగు, ఆరు సాధారణ గదులు ఉన్నాయి. సూట్ రూమ్‌కు రూ.2,240, సాధారణ గదికి రూ.1,334 చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు.
నెరవేరని దాతల ఆశయాలు నిరుపయోగంగా దేవస్థానం కాటేజీలు ప్రయివేటు వసతి గృహాలే దిక్కు
కొండ దిగువన ప్రయివేటు వసతి గృహాలు, హోటళ్లు
అమ్మవారి ఆలయం చుట్టూ ప్రయివేటు హోటళ్లు, వసతి గదులు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు ఒకటి, రెండు మాత్రమే ఉండే హోటళ్లు, ఇప్పుడు పదుల సంఖ్యలోకి వచ్చాయి. మరో వైపున గదులు, కాటేజీలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భవానీలు, భక్తుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉన్నా, వారికి ఆలయ తరఫున సరైన వసతి కల్పించడంలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ అధికారులు భక్తుల వసతిపైన దృష్టి సారించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment