జవాబుదారీ పరిపాలన అందించడమే లక్ష్యం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ప్రజల సంక్షేమం, అభ్యున్నతి కోసం పారదర్శక, సమర్థవంతమైన జవాబుదారీ పరిపాలన అందించడమే ముఖ్య లక్ష్యమని జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జేసీతో పాటు డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పద్మాదేవి, మెప్మా పీడీ పి.సాయిబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ 109 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జేసీ గీతాంజలిశర్మ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 19న మొదలైన ప్రశాసన్ గావ్ సప్తాహ్ కార్యక్రమాన్ని 25వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. వివిధ ప్రభుత్వశాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పరిష్కరించబడిన ప్రజల సమస్యలపై విజయ గాథలను 25వ తేదీలోగా సమర్పించాలన్నారు. డీఆర్వో కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. మీ కోసం కార్యక్రమాన్ని మండలస్థాయిలో నిర్వహించాలని తహసీల్దార్లకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో ఒక్కొక్క జిల్లా అధికారి ఒక్కొక్క మొక్క నాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 28వ తేదీన కృష్ణాజిల్లాలో వన్ మ్యాన్ కమిషన్ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ విజిట్ ఉంటుందని, వివిధ శాఖల అధికారులు నిర్దేశించిన ప్రొఫార్మాలో సమాచారం ఇవ్వాలన్నారు. తొలుత జాయింట్ కలెక్టర్ వికలాంగులు, వయోవృద్ధుల సహాయ సంస్థ, నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో దివ్యాంగ లబ్ధిదారికి స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షల చెక్కును అందజేశారు.
ముఖ్యమైన అర్జీలు ఇవీ..
● బందరు మండలం గోకవరం గ్రామానికి చెందిన తాను మంచంలో నుంచి లేవలేని స్థితిలో ఉన్న దివ్యాంగురాలినని, ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా రూ.6 వేల దివ్యాంగ పింఛను వస్తోందని దీనిని రూ.15 వేలకు పెంచి ఆదుకోవాలని కోరుతూ చిట్టిప్రోలు హిమబిందు అర్జీ ఇచ్చారు.
● వృద్ధులమైన తమ బాగోగులను తమ కుమారుడు చూడటం లేదని, ఎలా బతకాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గుడివాడ పట్టణానికి చెందిన అల్లాడ నాంచారయ్య దంపతులు అర్జీ ఇచ్చారు. దీనిపై డీఆర్వో స్పందిస్తూ ఆర్డీఓ కార్యాలయానికి సిఫార్సు చేసి వారి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మీ కోసంలో జేసీ గీతాంజలిశర్మ
Comments
Please login to add a commentAdd a comment