విద్యుత్ చార్జీలపై పోరుబాట
గుణదల(విజయవాడ తూర్పు): పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన విద్యుత్ కార్యాలయాలవద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు పెరిగిన విద్యుత్ చార్జీలపై వినతిపత్రాలు ఇస్తామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు విద్యుత్‌చార్జీల పెంపుపై పోరుకు సిద్ధంగా ఉండా లని కోరారు. గుణదలలోని తన కార్యాలయంలో పార్టీ వెస్ట్ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ మొండితోక అరుణ కుమార్‌తో కలసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి, ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రజలను మోసగించిందని విమర్శించారు. సూపర్ సిక్స్ అంటూ కల్లబొల్లి మాటలు చెప్పిన టీడీపీ నాయకులు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు అమలుకావడంలేదని, నిత్యావసర ధరలు పెరిగి సామా న్యుడికి పెను భారంగా మారాయని, ఇంతలో విద్యుత్ చార్జీలను పెంచి పేద ప్రజలపై మరింత భారాన్ని మోపారని దుయ్యబట్టారు.
సంక్షేమం, అభివృద్ధి కనుమరుగు
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కనుమరుగైందని వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజా సంక్షే మమే ధ్యేయంగా మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రూ.15,500 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని దుయ్యబట్టారు. ప్రజలను ప్రభుత్వమే నమ్మించి మోసం చేస్తోందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి కుంటుబడిందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి విమర్శించారు. ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా టీడీపీ నాయకులు నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డెప్యుటీ మేయర్లు అవుతు శైలజరెడ్డి, బెల్లం దుర్గ, వైఎస్సార్ సీపీ నాయకుడు కడియాల బుచ్చిబాబు, పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ వెంకటసత్యనారాయణ, కార్పొరేటర్లు కలపాల అంబేడ్కర్, వియ్యపు అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.
27న విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసనలు మభ్య పెట్టి మోసగించిన కూటమి పాలకులు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
Comments
Please login to add a commentAdd a comment