అరుణకీలాద్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ నెల 21 నుంచి ప్రారంభమైన దీక్షల విరమణ బుధవారం 5వ రోజు పరిసమాప్తమయ్యాయి. భవానీల రాకపోకలతో ఇంద్రకీలాద్రి పరిసరాలు, గిరి ప్రదక్షిణ మార్గం అరుణవర్ణమైంది. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్య పూజల అనంతరం భవానీల దర్శనానికి అనుమతించారు. మంగళవారం సాయంత్రం నుంచి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న భవానీలు అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత క్యూలైన్‌లోకి చేరారు. రాత్రి 12 గంటల నుంచి రద్దీ అధికం కావడంతో వీఎంసీ కార్యాలయం, సీతమ్మ వారి పాదాలు సమీపంలోని కంపార్టు మెంట్లలోకి భవానీలను మళ్లించారు. తొక్కిసలాట జరగకుండా వారిని క్యూలైన్‌లోకి మళ్లించారు.
అర్ధరాత్రి నుంచే రద్దీ
అర్ధరాత్రి 1.30 నుంచి ఉదయం 8.30 గంటల మధ్య సుమారు 20 వేల మంది భవానీలు, భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారంటే రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థ్ధమవు తుంది. ఉదయం 9 గంటల తర్వాత గిరి ప్రదక్షిణ మార్గంలోనూ, క్యూలో రద్దీ తగ్గింది. సాయంత్రం వరకు అమ్మవారి దర్శనానికి ఓ మోస్తరు రద్దీనే కనిపించింది. విరమణల సందర్భంగా భవానీలు 20 లక్షల లడ్డూలను కొనుగోలు చేశారు. ఆరు లడ్డూల బాక్స్ ప్యాకింగ్ చేసిన ప్రసాదాన్ని ఈ ఏడాది ప్రవేశపెట్టగా, వాటినే అత్యధికంగా విక్రయించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
పూర్ణాహుతి
ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరస్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో మహా పూర్ణాహుతిని అర్చకులు, వేద పండితులు, వైదిక కమిటీ సభ్యులు చేశారు. పూర్ణాహుతి కార్యక్రమంలో ఈవో కె.ఎస్. రామరావు దంపతులు, డీఈవో రత్నరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం, ప్రసాదాల వితరణ జరిగింది. కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాద్‌శర్మ, ప్రధాన అర్చకులు ఎల్‌డీ ప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
గిరి ప్రదక్షిణకు మూడు గంటలు
దీక్షల విరమణలో భవానీలు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. 8 కిలో మీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణ మూడు గంటల పాటు సాగింది. సాధారణ పౌర్ణమి, ఇతర పర్వదినాల్లో గిరి ప్రదక్షిణకు రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడు తుంది. దీక్షల విరమణలో నాలుగో రోజు రాత్రి నగరానికి చెందిన సాధారణ భక్తులు, భవానీలు గిరి ప్రదక్షిణ చేపట్టడం ఆనవాయితీ. మంగళవారం రాత్రి గిరి ప్రదక్షిణకు మూడు నుంచి మూడున్నర గంటల పాటు కొనసాగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు
నేడు, రేపు కూడా ఏర్పాట్లు
దీక్షల విరమణ ముగిసినా గురువారం, శుక్రవారం ఏర్పాట్లు యధావిధిగా కొనసాగుతాయని ఈవో కె.ఎస్.రామరావు తెలిపారు. గురువారం భవానీల రద్దీ కొంత మేర ఉండే అవకాశం ఉండటంతో ఏర్పాట్లను కొనసాగించనున్నామన్నారు. భక్తులు, భవానీలు వినాయకుడి, టోల్‌గేట్ నుంచి క్యూలైన్ల ద్వారా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. దర్శనానంతరం మహా మండపం మెట్లు, మల్లికార్జున ఆలయం మెట్ల మీదగా కిందకు చేరుకుంటారని తెలిపారు.
● ఐదు రోజుల్లో 3.70 లక్షల మంది భవానీలు దీక్షలను విరమించారు. 1.34 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో వైపున దీక్ష విరమణల్లో 5 రోజులు 55 వేల మంది భవానీలు తలనీలాలను సమర్పించగా, 7.65 లక్షల వాటర్ బాటిల్స్‌ను భవానీలు, భక్తులకు పంపిణీ చేసినట్లు పేర్కొంటున్నారు.
ముగిసిన భవానీ దీక్షల విరమణ ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతి 5వ రోజు కొనసాగిన భవానీల రద్దీ నేడు, రేపు ఏర్పాట్లు యఽథాతథం
Comments
Please login to add a commentAdd a comment