అంబేడ్కర్ స్మృతి వనం పవిత్రతను కాపాడండి
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం పవిత్రతను కాపాడాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి ఉప్పులేటి దేవీప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్పందించి వెంటనే స్మృతివనంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్‌ను తొలగించాలని ఆయన కోరారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం ప్రాంగణంలో డ్వాక్రా బజార్ ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆద్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉప్పులేటి దేవీ ప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా బజార్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతేకాకుండా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పట్ల అమిత్‌షా వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని, అందుకు స్మృతి వనంలో డ్వాక్రా బజార్ ఏర్పాటు చేయడమే నిదర్శనం అన్నారు. జేఏసీ వైస్ చైర్మన్ గుర్రం రామారావు, పరసా సురేష్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్‌పాల్, బొనిగల ప్రదీప్ హాజరయ్యారు.
అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవీప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment