ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవస్థానానికి చెందిన డిజిటల్ కీని అప్పగించడంలో నిర్లక్ష్యం వహించిన దుర్గగుడి సీనియర్ అసిస్టెంట్ డీవీవీజీకే ప్రసాద్(వేణు)పై ఆలయ ఈవో రామచంద్ర మోహన్ సస్పెన్షన్ వేటు వేశారు. దుర్గగుడి ఈవోగా రామచంద్రమోహన్ బాధ్యతలు స్వీకరించి తర్వాత దేవస్థానానికి సంబంధించిన ప్రతి ఫైల్‌ను ఈ ఫైల్‌లో అప్‌లోడ్ చేయాలని సంబంధిత విభాగాల ఏఈవోలు, సూపరిండెంటెంట్లను ఆదేశించారు. దేవస్థాన ఈవోకు సంబంధించిన కీ సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్(వేణు) వద్దే పెట్టుకున్నారు. అంతే కాకుండా ఎఫ్‌ఏసీ ఓచర్లపై పాత తేదీలలో సంతకాలు చేసి ఉండటాన్ని గుర్తించారు. దీనిపై వేణును ఈవో వివరణ కోరినప్పటికీ సమాధానం చెప్పకపోవడంతో అతనిపై చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు.
నేడు హుండీ కానుకల లెక్కింపు
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను మంగళవారం లెక్కించనున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో కానుకల లెక్కింపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే ప్రతి మంగళవారం దేవస్థాన అధికారులు, సిబ్బందికి వీకాఫ్ ఉండగా, ఇకపై వీకాఫ్ ఉండబోదని తెలుస్తోంది. దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రమోహన్ వీకాఫ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గణతంత్ర వేడుకలకు
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి 26వ గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జాతీయ సమైక్యతను చాటేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టేడియం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకల నిర్వహణ ఏర్పాట్లను సీపీ రాజశేఖరబాబుతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసి పేరెడ్‌కు సిద్ధంగా ఉండాలన్నారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పతాకావిష్కరణ చేస్తారన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొంటారని, ఈ నేపథ్యంలోనే ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రధాన వేదిక, వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలో ప్రొటోకాల్ అనుసరించి ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకలు వీక్షించేందుకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కంటింజెంట్ విభాగాల ప్రదర్శనలు, రాష్ట్ర ప్రగతిని చాటే శకటాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బందితో మెడికల్ క్యాంప్‌ను, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలన్నారు. పోలీస్ కమిషనర్ పి.రాజశేఖరబాబు మాట్లాడుతూ వీఐపీ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలకు ఎప్పటికప్పుడు రిహార్సల్స్ చేసుకొని సిద్ధంగా ఉండాలన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో డీసీపీ గౌతమిశాలీ, ఆర్డీఓ చైతన్య, ముఖ్యమంత్రి భద్రత, రాజ్ భవన్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment