రోడ్డు ప్రమాదంలో కాకినాడ వాసుల దుర్మరణం
పమిడిముక్కల: ద్విచక్ర వాహనం అదుపు తప్పి గోడను ఢీ కొన్న ప్రమాదంలో కాకినాడ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై మంటాడ ఫ్లై ఓవర్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా పాత ఇసుకపల్లికి చెందిన దాసరి నిమ్స్ చంద్ర(21) తన బైక్‌పై కాకినాడ జిల్లా కిర్లంపూడికి చెందిన ముక్తా నాగవీరదుర్గ(20)తో హైదరాబాద్ బయలు దేరాడు. మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు వస్తుండగా మంటాడ ఫ్లై ఓవర్ వద్ద బైక్ అదుపు తప్పి గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చొన్న నాగవీరదుర్గ అక్కడికక్కడే మృతి చెందాడు. నిమ్స్ చంద్రకు తీవ్ర గాయాలవడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ శ్రీను తెలిపారు.
బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం.. వ్యక్తి మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): బైక్ అదుపు తప్పడంతో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణా జిల్లా నిడమానూరు చెందిన యార్లగడ్డ విజయ సాయిచౌదరి(55) గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని ఓ యూనివర్సిటీలో కన్‌స్ట్రక్షన్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రతి రోజు ఉదయం విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అతను తన ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి బయలుదేరాడు. సాయంత్రం 6.30 గంటలకు వారధి 39వ కానా వద్దకు చేరుకోగానే అతని ద్విచక్ర వాహనం అదుపు తప్పి ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. దీంతో సాయిచౌదరి కిందపడిపోయాడు. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం అతని తలమీదుగా వెళ్లడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శిక్ష పడుతుందనే భయంతో యువకుడి ఆత్మహత్య
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓ కేసులో కోర్టు శిక్ష విధిస్తుందన్న భయంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలోని ఊర్మిళానగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... ఊర్మిళానగర్‌కు చెందిన షేక్ బాజీ షరీఫ్(26) ఆటోనగర్‌లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఓ బాలిక వెంట పడి ఏడిపించాడని, ఆమె మరణానికి కారణమయ్యాడని అతనిపై 2018లో భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో బాజీ షరీఫ్ కోర్టు వాయిదాలకు తిరుగుతున్నాడు. త్వరలో కోర్టులో కేసు ట్రయల్‌కు వస్తుందని, తనకు శిక్ష పడే అవకాశం ఉందని పలుమార్లు తల్లి వద్ద వాపోయాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం బాజీ షరీఫ్ తల్లి కూలీ పనులకు ఐరన్ యార్డుకు వెళ్లింది. ఆరోగ్యం బాగోలేక ఆమె మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చింది. అప్పటికే బాజీ షరీఫ్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై అతని తల్లి షేక్ ఆదాం బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఉన్న కేసులో శిక్ష పడుతుందని పదే పదే చెబుతూ మనస్తాపానికి గురై తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment