తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయాలి
కంకిపాడు: వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ నిరంతరాయంగా అందించాలని కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు డిమాండ్ చేశారు. ఏపీ కౌలురైతు సంఘం కృష్ణాజిల్లా కమిటీ ప్రత్యేక సమావేశం కంకిపాడులోని ఎంబీ భవన్‌లో సోమవారం నిర్వహించారు. రంగారావు మాట్లాడుతూ.. గత ఖరీఫ్ సీజన్‌లో సంభవించిన వరదలు, భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రబీలో నష్టాన్ని అధిగమించేందుకు సమాయత్తమవుతున్న రైతులకు రెండు గంటల వ్యవసాయ విద్యుత్ కోత పెనుభారంగా మారుతుందన్నారు. పంటపై పెట్టిన లక్షల రూపాయల పెట్టుబడి కోల్పోయినా ప్రభుత్వం అరకొరగానే ఆదుకుందని చెప్పారు. పూత, పిందె దశలో ఉన్న అపరాలు, మొక్కజొన్న తోటలకు నీటి తడులు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వరి నాట్లు సజావుగా సాగటం లేదన్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి వి.శివశంకర్‌రావు, జిల్లా కమిటీ ప్రతినిధులు సీహెచ్ శ్రీహరి, కౌలురైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు జె.రవి, వి.మరియదాసు, వై.జోజి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment