● సమస్యాత్మక గ్రామాలపై నిఘా పెంచండి ● లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేయించండి ● నేర సమీక్షలో క్షేత్రస్థాయి అధికారులకు ఎస్పీ ఆదేశం
కర్నూలు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున అందరూ సిద్ధంగా ఉండాలని క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శుక్రవారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో ఎస్పీ నేర సమీక్ష నిర్వహించారు. లైసెన్స్ కలిగిన ఆయుధాలను డిపాజిట్ చేయించాలని ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాలపై, రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెంచాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రబుల్ మాంగర్స్‌ను గుర్తించి బైండోవర్ చేయాలని, నాటుసారా తయారీ, విక్రయదారులపై నిరంతర దాడులు నిర్వహించాలన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డీఎస్పీలు ప్రతిరోజూ బైండోవర్, ఎన్‌బీడబ్ల్యూ, ఎన్‌డీపీఎస్ కేసులతో పాటు కేడీలు, సస్పెక్టుల సమాచారం తెలుసుకోవాలన్నారు. గ్రామాల్లోని పోలింగ్ బూత్‌ల వివరాలు, పోలింగ్ బూత్ లొకేషన్, రూట్ మ్యాప్ గురించి ఇతర శాఖల సమన్వయంతో పూర్తిగా సేకరించాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలు పెంచుకుని గ్రామాల్లో సమస్యలపై ముందస్తు సమాచారాన్ని సేకరిస్తుండాలన్నారు. ఎలాంటి సంఘటన జరగకుండా ముందస్తు నేర నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. నేర సమీక్షలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ టి.సర్కార్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు నాగభూషణం, విజయశేఖర్, సుధాకర్‌రెడ్డి, శివనారాయణస్వామి, శ్రీనివాసరెడ్డి, సీతారామ య్య, ఇలియాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment