పడిపోయిన ఉల్లి ధర
● నష్టాలు మూటగట్టుకున్న రైతులు
● అక్టోబరు 29వ తేదీ వచ్చిన
ఉల్లి మూడు రోజుల పాటు కొనుగోలు
● సరుకు కుళ్లిపోవడంతో
ధరపై తీవ్ర ప్రభావం
● నేడు, రేపు మార్కెట్‌లో
క్రయవిక్రయాలు బంద్
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి ధర ఒక్కసారిగా పడిపోయింది. అక్టోబరు 31వ తేదీ వరకు క్వింటాలు ఉల్లి ధర రూ.4000 పలికింది. ఉన్నట్టుండి శుక్రవారం గరిష్ట ధర ఏకంగా రూ.1,859కి పడిపోయింది. ఉల్లిగడ్డలు మురిగిపోయినందున ధర లభించలేదని మార్కెట్ కమిటీ అధికారులు సెలవిస్తున్నారు. అయితే, సరుకు కొనుగోలులో మార్కెట్ కమిటీ అధికారులు చేసిన జాప్యం చేయడమే ఇందుకు కారణమని రైతులు చెబుతున్నారు. అక్టోబరు నెల 29వ తేదీ రాత్రి నుంచి వచ్చిన ఉల్లి గడ్డలను 30, 31, 1వ తేదీల్లో మూడు రోజుల పాటు కొనుగోలు చేశారు. సరుకు ఎక్కువగా వచ్చినప్పుడు ఉదయం 9 గంటలకే టెండరు ప్రక్రియ చేపట్టి ఉంటే ఒకే రోజు పూర్తి అయ్యేది. అక్టోబరు 26వ తేదీన 24,372 క్వింటాళ్లు రాగా ఒకే రోజు టెండరు వేశారు. 29వ తేదీ రాత్రి నుంచి వచ్చిన సరుకును మూడు రోజుల పాటు కొనుగోలు చేశారు. వరుసగా మార్కెట్‌లోనే 4 రోజులు ఉల్లిగడ్డలు ఉండిపోవడం వల్ల పంట దెబ్బతినింది. గ్రేడింగ్ మీద, గ్రేడింగ్ చేసి క్వింటాలుకు 10కిలోలకు పైగా పారబోశారు. టన్నుకు క్వింటాలు వరకు పారబోయాల్సి వచ్చింది. అక్టోబరు 29వ తేదీ దాదాపు 25,438 క్వింటాళ్లు మార్కెట్‌కు రాగా.. 30న 12883 క్వింటాళ్లు, 31న 10,885 క్వింటాళ్లు, 1వ తేదీన 1670 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. రోజుల తరబడి మార్కెట్‌లోనే సరుకు ఉండిపోవాల్సి రావడం వల్ల ఉల్లి నాణ్యత దెబ్బతినడంతో ధర పడిపోయింది. కనిష్ట ధర రూ.495, గరిష్ట ధర రూ.1,859 మాత్రమే లభించింది. సగటు ధర రూ.1000 నమోదు అయింది. ఎక్కువ మంది రైతులకు రూ.500 నుంచి రూ.1500 వరకు మాత్రమే లభించడం తీవ్ర ఆందోళన కలిగించింది. మార్కెట్‌లో నాలుగు రోజులున్నా నష్టాలే మూటగట్టుకొని వెళ్లాల్సి వచ్చిందని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఎటు చూసినా కుళ్లిన ఉల్లిగడ్డలే..
మార్కెట్‌లో ఎటు చూసిన కుళ్లిపోయిన ఉల్లి కనిపిస్తోంది. ఎప్పటికప్పడు ఏరివేసిన ఉల్లిగడ్డలను ఎక్కడబడితే అక్కడ పడేస్తున్నారు. కాల్వలు నిండిపోయాయి. దీంతో దుర్గందం వెల్లువెత్తుతోంది.
సోమవారమే ఉల్లి క్రయవిక్రయాలు..
మార్కెట్ యార్డులో ఈ నెల 2, 3 తేదీల్లో ఎలాంటి వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరగవు. 4వ తేదీ నుంచి మార్కెట్‌లో ఉల్లికొనుగోళ్లు చేపడుతారు. 2,3 వ తేదీల్లో కొనుగోలు చేసిన ఉల్లిని బయటకు పంపండం, మరోవైపు క్లీనింగ్ చేయడం చేస్తారు. 4 నుంచి యథావిధిగా కొనుగోలు జరుగుతాయని సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. 3వ తేదీ 12 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 8 గంటల వరకు మాత్రము మార్కెట్‌లోకి ఉల్లిగడ్డలను అనుమతిస్తామని పేర్కొన్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న ఉల్లి క్రయవిక్రయాలను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత గురువారం పరిశీలించారు. కలెక్టర్‌తో మాట్లాడి యార్డును విశాలమైన ప్రదేశంలోకి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment