● అంజనేయస్వామి భక్తురాలిపై దాడి ● దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
డోన్/ప్యాపిలి: తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజలపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. గురువారం ఏకంగా ఆంజనేయ స్వామి ఆవహించే మహిళతో పాటు ఆమె భర్తపై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. వివరాల్లోకి వెళితే.. డోన్ పట్టణానికి చెందిన దూదేకుల రోజాబీ అనే మహిళకు ఆంజనేయ స్వామి ఆవహిస్తుంటాడని భక్తుల నమ్మకం. ప్రతి మంగళవారం ఆమె చిన్నపొదిళ్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు కోరికలు చెప్పుకొని అవి నెరవేరితే మొక్కులు చెల్లిస్తుంటారు. ఇదిలా ఉండగా డోన్‌లో ఉంటున్న టీడీపీ నాయకులు వైఈ నాగరాజు గౌడు, ఎల్లాగౌడు తదితరులు గతనెలలో మద్యం షాపు కోసం టెండర్ వేశారు. లక్కీడ్రాలో తమకు దుకాణం దక్కితే చిన్నపొదిళ్లలో ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న తమ సోదరి చిట్టెమ్మ ఇంటిని గుడికి రాసిస్తామని రోజాబీకి చెప్పారు. కోరుకున్నట్టే జరగడంతో ఇటీవల ఆమెను కలిసి త్వరలోనే ఇంటిని గుడికి రిజిస్ట్రేషన్ చేసిస్తామని వాగ్దానం చేశారు. అయితే, చిట్టెమ్మ భర్త తరఫు బంధువులైనా టీడీపీ నాయకులు రమేశ్‌గౌడు, రాంభూపాల్ గౌడు, చరణ్ గౌడు, రామయ్య గౌడు, సుజాత తదితరులు దీన్ని జీర్ణించుకోలేక గురువారం ఆంజనేయ స్వామి గుడి వద్దకెళ్లి రోజాబీ, దస్తగిరి దంపతులపై దాడులకు తెగబడ్డారు. రోజాబీని మహిళ అని చూడకుండా అసభ్య పదజాలంతో తిడుతూ ఆమె జుత్తు పట్టుకుని గుడి బయటకు ఈడ్చుకొచ్చి కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకుని టీడీపీ నాయకులను సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. వినకపోవడంతో గ్రామస్తులందరూ ఏకమై వారిని దేహశుద్ధి చేశారు. కాగా తనపై జరిగిన దాడి గురించి రోజాబీ ప్యాపిలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment