త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆదోని అర్బన్: పట్టణంలోని పాత ఓవర్ బ్రిడ్జి సైడ్ వాల్‌ను కారు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. కారు ఆలూరు వైపు నుంచి ఆదోని పట్టణం వైపు వస్తుండగా అదుపు తప్పి వంతెనపై ఉన్న సైడ్ వాల్‌ను ఢీకొంది. దీంతో వా ల్‌భాగం కొంత దెబ్బతిని కింద పడింది. వేగానికి కారు కూడా కిందపడిపోయి ఉంటే వంతెన కింద వ్యాపారాలు చేసుకునే వారికి ప్రమాదం జరిగేది. సిమెంట్ దిమ్మెలు పడగానే అక్కడున్న వ్యా పారులు భయాందోళన చెందారు. అయితే, కారు డ్రైవర్ ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
యువతి ఆత్మహత్య
బండి ఆత్మకూరు: పెళ్లి ఇష్టం లేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని పరమటూరు గ్రామంలో గురువారం ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ జగన్‌మోహన్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సాయిబాబారెడ్డికి నలుగురు కుమార్తెలు. చిన్న కుమార్తె కొణిదెల జ్యోతి (32)ని వివాహం చేయాలని భావించాడు. ఈ విషయం కుమార్తెకు చెప్పాడు. పెళ్లి ఇష్టంలేకపోవడంతో ఆ యువతి ఇంట్లో ఒక గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. అక్కడే పంచనామా నిర్వహించి మృత దేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఈమేరకు తండ్రి సాయిబాబా రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కాలువలో పడి వ్యక్తి మృతి
అవుకు: మండల పరిధిలోని ఓబుళాపురం గ్రామంలో కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఓబుళాపురం గ్రామానికి చెందిన జీనిగె శివరామయ్య (27) గురువారం రాత్రి గ్రామ సమీపంలో మూత్ర విసర్జనకు వెళ్లాడు. అక్కడ చెరువు కాలువలో ప్రమాదవశాత్తు పడ్డాడు. ఉదయాన్నే గడ్డి కోయటానికి వెళ్లిన గ్రామ మహిళలకు శవమై కనిపించడంతో కుటుంబీకులకు సమాచారమిచ్చారు. మృతుడికి రెండేళ్ల క్రితం వెల్దుర్తికి చెందిన మహాలక్ష్మితో వివాహం జరిగింది. నాలుగు నెలల వయస్సు ఉన్న కుమార్తె ఉంది. పుట్టింటి దగ్గర ఉన్న భార్యకు విషయం తెలియడంతో హుటాహుటిన గ్రామానికి చేరుకొని భర్త మృతదేహాన్ని చూసి బోరున విలపించింది.
గుర్తు తెలియని
వాహనం ఢీ కొని..
ఓర్వకల్లు: కర్నూలు–కడప జాతీయ రహదారిపై గురువారం గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఎస్‌ఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. రామళ్లకోట గ్రామానికి చెందిన నాగన్న(65) మతి స్థిమితం లేక వివిధ ప్రాంతాల్లో నడుచుకుంటూ తిరిగేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం స్వగ్రామం నుంచి హుసేనాపురంలోని తన సోదరిని చూసేందుకు వెళ్లాడు. గురువారం జాతీయ రహదారి వెంట ఓర్వకల్లు వైపు నడుచుకుంటూ వెళ్లుతుండగా, స్థానిక పవర్ గ్రిడ్ సంస్థ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరక మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment