రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
ఎమ్మిగనూరురూరల్: వ్యవసాయంలో రాణించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ శారదజయలక్ష్మి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆమె సందర్శించారు. సందర్శనలో విధుల పరిశీలన, సాంకేతిక ప్రణాళికలు అమలుపై శాస్త్రవేత్తలతో చర్చించారు. అనంతరం కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డా. కె. రాఘవేంద్రచౌదరి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, రైతులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులు రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడి మార్కెటింగ్, నాణ్యమైన విత్తనాలు, జీవన ఎరువులు, అద్దె పరికరాల భవనాలను ఏర్పాటు చేసుకొని స్వయం సమృద్ధి సాధించాలని చెప్పారు. యంత్రీకరణలో భాగంగా కేవీకేలో వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి డ్రోన్‌లను అద్దెకు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమీకృత వ్యవసాయ పద్ధతులను పాటిస్తే నష్టాలను అధిగమించవచ్చునన్నారు. శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులో ఉండి వారికి పంటల సాగులో సలహలు, సూచనలు అందించాలని చెప్పారు. పంటల సాగులో రసాయన ఎరువుల వాడకం తగ్గించి జీవన ఎరువులు, సేంద్రియ ఎరువుల వాడకం పెంచే విధంగా చూడాలని సూచించారు. సమావేశంలో జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ వెంకటేశ్వర్లు, కర్నూల్ మండల ఏఓ శశిధర్‌రెడ్డి, పెద్దకడుబూరు ఏఓ వరప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment